బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు పచ్చదనాన్ని పెంచితే రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎండబెడుతోంది. నాడు ఏ గ్రామానికి వెళ్లినా పచ్చదనం వెదజల్లుతూ ప్రకృతి వనాలు స్వాగతం పలుకగా నేడు మోడువారి దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 475 పంచాయితీల్లో ఒక ఎకరం భూమిలో ప్రకృతి వనాలు, 23 మండలాలకుగాను మండలానికో 10 ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను నాటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో అవి ఓ చిన్నపాటి అడవులను తలపించేవి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహణా లోపంతో మెజారిటీ వనాలు మాడి మసైపోతున్నాయి. -సూర్యాపేట, జూన్ 29 (నమస్తే తెలంగాణ)
ఉమ్మడి రాష్ట్రంలో జనం తాగేందుకే గుక్కెడు నీళ్లు కరువయ్యేవి. దీంతో పచ్చదనం అనేది మచ్చుకు కూడా కనిపించకపోయేది. ఇక అటవీ భూముల విషయానికి వస్తే జిల్లాలో దాదాపు 42 వేల ఎకరా లకుపైనే అటవీ భూములు ఉండగా వాటి సంరక్షణను ఎవరూ పట్టించుకోకపోవడంతో దశాబ్దాల తరబడి కబ్జాలకు గురై 27,650 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. రికార్డుల్లో పేరుకు అవి అటవీ భూములే.. మచ్చుకు పచ్చదనం కనిపించేది కాదు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 6,19,989 ఎకరాల భూమి ఉండగా అందులో 33 శాతం అటవీ భూములు ఉండాల్సి ఉండగా జిల్లాలో ఒక శాతం కూడా అడవులు లేవు.
నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూలైలో ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ద్వారా జిల్లాలో మొక్కలు పెరిగి వృక్షసంపద 10 శాతానికి పెరిగింది. గత ఏడు హరితహారాల్లో పల్లెలు, పట్నాల రహదారులతో పాటు జాతీయరహదారులు, ఇంటర్నల్ రోడ్లు తదితరాల వెంట నాటిన మొక్కలతో సుమారు 67,477 ఎకరాల్లో పచ్చదనం పెరిగి ఓ రికార్డు నమోదైంది.
జిల్లాలో 27,650 ఎకరాల అటవీ భూముల్లో 2.17 కోట్ల మొక్కలు, విత్తన బంతులు వేయగా గ్రామాలు, పట్టణాల రహదారులు, జాతీయ రహదారులతో పాటు ఇంటర్నల్ రోడ్లు కలిపి సుమారు 7,106 కిలోమీటర్ల పొడవునా రెండు పక్కల నాటిన మొక్కలు దాదాపు 27,450 ఎకరాలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు ఇలా అన్నీ కలిపి మరో 12 ,377 ఎకరాల్లో సుమారు 12 కోట్ల వరకు మొక్కలు నాటారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహణా లో పంతో పెరిగిన మొక్కలు మాడిపోతున్నాయి.
ఎండిపోతున్న వనాలు..
బీఆర్ఎస్ హయాంలో నెలనెలా పంచాయతీలకు నిధులు ఇవ్వడంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వందశాతం పూర్తయింది. ప్రతి గ్రామానికి ట్రాక్టర్లు, ట్యాంకర్లు కొనుగోలు చేయడంతో క్రమం తప్పకుండా మొక్కలకు నీళ్లు పోయడంతో ఒక్క మొక్క ఎండిపోయేది కాదు. ఎక్కడైనా మొక్కలు ఎండిపోతే వెంటనే అదే చోట మరో మొక్క నాటేలా చర్యలు చేపట్టగా నేడు ఉన్న మొక్కలకు నీళ్లు పోయకపోవడంతో మాడి మసైపోతున్నాయి.
పట్టించుకోని ప్రభుత్వం
నిర్వహణా లోపంతో గ్రామాల్లో పల్లె ప్రకృ తి వనాల్లోని చెట్లు ఎండుతున్నా అధికారులు పట్టించుకోవ డంలేదు. అప్పటి బీ ఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఓ పల్లె ప్రకృతివనాన్ని ఏర్పాటు చేసి విరివిగా మొ క్కలు నాటి, వాటి నిర్వహణను గ్రామ పం చాయతీలకు అప్పగించి గ్రామాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పల్లె ప్రకృతి వనంలోని మొక్కలు మాడిమసైపోతున్నాయి.
– దామెర్ల రమేశ్, అనంతారం