హాలియా, మే 20 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న మక్కువ అన్నం పెట్టే రైతులను ఆదుకోవడంలో లేదని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. మంగళవారం హాలియాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినప్పటికీ ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందన్నారు. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలకు విశ్వసనీయత పోయిందని తెలిపారు. అందాల పోటీ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందమైన భామల వెంట తిరుగుతూ ప్రజా సమస్యలను, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశాడన్నారు. ప్రపంచ సుందరీమణులకు చూపించిన ప్రదేశాలన్నీ నాగార్జునసాగర్ బుద్ధవనం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, సచివాలయం, పిల్లలమర్రి అన్ని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినవేనని తెలిపారు.
ఏడాదిన్నర కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటంటే అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భూముల అమ్మకం, మూసి నది సుందరీకరణ పేరుతో నిధులను కాజేయడం, ఆక్రమణల సాకుతో హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేయడం అన్నారు. అందాల పోటీల నిర్వహణకు ప్రభుత్వం వద్ద రూ.200 కోట్లు ఉంటాయి కానీ రైతులకు రైతుబంధు, రుణమాఫీ చేసేందుకు మాత్రం డబ్బులు ఉండవా అని ఆయన ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా మౌలిక సదుపాయాలు కల్పించిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేందుకు ఐకేపీ కేంద్రాల్లో సరిపడా బస్తాలు లేవు, కొన్న ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించేందుకు లారీలు లేవు, ధాన్యం కొనుగోలు అంతా అస్తవ్యస్తంగా ఉందన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు ఆంధ్రా నుంచి తక్కువ ధరకు ధాన్యం తీసుకొచ్చి ఐకేపీ కేంద్రాల్లో పోసి విక్రయిస్తూ బోనస్ రూపంలో ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లు కొల్లగొడుతున్నట్లు తెలిపారు. ఆంధ్రా నుంచి ధాన్యం కొనుగోలు అక్రమాల విషయంలో ఎమ్మెల్యే తన వెంట ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్‌ను అమెరికాకు పంపి కింది వారిని మాత్రం జైలుకు పంపాడన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రా నుంచి ధాన్యం అక్రమ రవాణాకు పాల్పడిన నిజమైన దోషులను గుర్తించి శిక్షించాలన్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అర్హులైన పేదలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కానీ, పేద ప్రజలకు కానీ ఒరిగిందేమీ లేదన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి సద్వినియోగం పై ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. ఈరోజు నాగార్జునసాగర్ జలాశయంలో నీరు డెడ్ స్టోరేజీకి వెళ్లింది. నారుమల్లకు నీరు కాదు కదా ఆగస్టు వరకు తాగునీటిని కూడా ఇవ్వలేని పరిస్థితిలో నాగార్జునసాగర్ జలాశయం ఉందన్నారు. అన్నింట రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి ప్రతి రోజు ప్రజలు క్షోభ పడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, నాగులవచ తిరుపతి రావు, పట్టణ అధ్యక్షుడు వడ్డే సతీశ్ రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ కామాల జానయ్య, పామోజు వెంకటాచారి, పాక్స్ వైస్ చైర్మన్ గుండెబోయిన వెంకటేశ్వర్లు, పొదిల్ల శ్రీనివాస్, సురభి రాంబాబు, మాజీ ఎంపీటీసీ పెద్దమాము యాదయ్య, రాయణబోయిన రామలింగయ్య, మాజీ సర్పంచ్ రాములు, శంకర్, సందీప్ పాల్గొన్నారు.