నల్లగొండ, ఆగస్టు 21: నల్లగొండ జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. జిల్లాలోని ఆయా నియోజక వర్గాల్లో ఉన్న ఓటర్ల ముసాయిదా జాబితాను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విడుదల చేశారు. ఈ జాబితాను కలెక్టర్ కార్యాలయంతో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, తాసీల్దార్ కార్యాలయాలు, పోలింగ్ స్టేషన్లలో ప్రదర్శించనున్నారు. జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో మొత్తం 13,84,585 మంది ఓటర్లు ఉండగా సర్వీస్ ఓటర్లు 543 మంది ఉన్నారు. ఈ ఏడాది జనవరి-1న విడుదల చేసిన ఓటరు జాబితాలో జిల్లా వ్యాప్తంగా 13,55,482 మంది ఓటర్లు ఉండగా సోమవారం విడుదల చేసిన జాబితాలో 13,84,525కు పెరిగారు.
సెప్టెంబర్ 19వరకు అభ్యంతరాలకు గడువు
ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియ చేయాలని కలెక్టర్ చెప్పారు. ఓటరు జాబితాలో తప్పుల సవరణ, జాబితాలో పేర్లపై అభ్యంతరాలు సెప్టెంబర్ 19 వరకు తెలుపవచ్చని పేర్కొన్నారు. వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 28 వరకు పరిష్కరించి అక్టోబర్ 4న తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఈ ముసాయిదా జాబితాను చూసుకొని కొత్తగా ఓటరు నమోదుకు ఫారం -6, తప్పుల సవరణకు ఫారం 8, అభ్యంతరాలకు ఫారం 7ను వినియోగించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బక్క పిచ్చయ్య, నర్సిరెడ్డి, అశోక్, సైదులు, యాదగిరి, మల్లిఖార్జున్, కుతుబొద్దీన్, ఎన్నికల డీటీ విజయ్ పాల్గొన్నారు.