సూర్యాపేట, జూలై 14 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజ ల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల తరబడి తాము ఓటు వేస్తున్నామని, ఎన్నో ఎన్నికల్లో ఓట్లు వేసిన తమ పేర్లు 2002 జాబితాలో లేకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై అధికారులను ప్రశ్నిస్తే తమకు కూడా తెలియదని చెబుతున్నారు. ఎన్యుమరేషన్ ఫారంలోని మూడో కాలం నిం పితే ఓటు హక్కు ఉంటుందని చెబుతుండగా పశ్చమ బెంగాల్లో కూడా ఇలాగే జరిగిందని, మరి మా ఓట్లు ఉంటాయా పోతాయా అని జనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికలు జరిగితే కొంత మంది డబ్బులొస్తాయని సంతోష పడుతుంటారు.
మరికొందరు మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని ఆలోచిస్తుంటారు. డబ్బుకైనా…మంచి అభ్యర్థిని ఎన్నుకోవడానికైనా ఓటు ఉంటేనే కదా… అలాంటిది అసలు వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు ఉంటుందా లేదా అని ప్రస్తుతం వేలాది మందిని తొలుస్తున్న ప్రశ్న. 2025 జాబితాలో ఉన్న ఓటర్లను 2002 నాటి జాబితాతో మ్యాచింగ్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే సర్ అమలు లో అధికారులు, ఉద్యోగుల కంటే బీఎల్వోల పాత్ర ఎక్కువగా ఉండటం, వారికి పెద్దగా అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కలెక్టర్ బీఎల్వోలకు సహాయకులను నియమించడంతో ఇబ్బందులు తొలిగిపోతున్నాయి.
సర్ ప్రక్రియ సందర్బంగా జిల్లాలోని వేలాది మంది పేర్లు 2002 జాబితాలో లేకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 50 నుంచి 80 సంవత్సరాలు కలిగి ఉండి ఆరేడు సార్లు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేశామని అయినప్పటికీ 2002 జాబితాలో పేర్లు లేకపోవడం అంటే ఏదైనా కుట్ర జరుగుతోందా మరేదైనా కారణమా..అసలు ఆ జాబితాను ఎవరు ఫైనల్ చేశారనే ప్రశ్నలు వస్తున్నాయి.
జిల్లాలో 1205 పోలింగ్ బూత్‌లు ఉండగా ఒక్కో బూత్‌లో దాదాపు 15 నుం చి 40 మంది పేర్లు 2002 జాబితాలో గాయబ్ అయ్యాయి. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ పాత్ర ఎంత..? రాజకీయ పార్టీల పాత్ర ఎంత అంటున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులను ప్రశ్నిస్తే నాటి జాబితా ఆన్లైన్లోనే ఉంటుందని దానినే బీఎల్వోలకు పంపిణీ చేశారని చెబుతున్నారు. ఒకవేళ ఆ జాబితాలో పేర్లు లేకపోతే వారి తల్లిదండ్రులతో మ్యాచింగ్ చేసుకోవచ్చు లేకుంటే ఎన్యుమరేషన్ ఫారంలోని మూడో కాలం నింపి ఇవ్వాలంటున్నారు.
ఇలాంటి వారికి తరువాత ఒక నోటీసు వస్తుందని, ఆ నోటీసు అందుకున్న వారు తాము భారతదేశ పౌరులమేనని, చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నామని నిరూపించుకుంటే ఓట్లు ఎక్కడికీ పోవంటున్నారే తప్ప అసలు పేర్లు ఎందుకు మాయమయ్యాయంటే మాత్రం సమాధానం లభించడం లేదు. ఇలా మూడో కాలం నింపిన వారి ఓట్లు పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున గల్లంతయ్యాయని మరి మా ఓట్లు ఉంటాయా లేక పోతాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అరవై ఏళ్లకు పైబడి సూర్యాపేట పట్టణంలో మాకు సొంత ఇల్లు ఉన్నది. 40 ఏండ్లుగా అన్ని ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నా. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018, 2023లో ఓట్లు వేసిన. కానీ సర్ మ్యాపింగ్‌కు 2002 ఓటరు జాబితాలో నా పేరు లేకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. మూడో కాలం నింపి ఇవ్వమంటే ఇచ్చా. ఏం జరుగుతుందో చూడాలి.
-హరినారాయణ,సూర్యాపేట
నాకు ఇప్పుడు ఎనభై ఏండ్లు. ఎన్నో ఏండ్ల సంది ఎమ్మెల్యే ఎలచ్చన్లల ఓటేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడేదో చేస్తున్నరంట. నా ఓటు పాతది లేదు ఇప్పటిదే ఉందని చెబుతున్నరు. మా ఆయన పేరు, అమ్మ పేరు, నాయన పేరు అడిగి వారి ఓట్లు ఎక్కడున్నయి అంటుండ్రు. మరి వాళ్లు సచ్చిపోయింది ఎప్పుడో.. వాళ్ల ఓట్లు యాడ దొరుకుతాయి. వాళ్లకు లేకుంటే నా ఓటు ఉండదా.పోతదా.. సావుదలకు వచ్చిన నాకు ఓటు లేకుండా చేయొద్దు.
-తడకమళ్ల యల్లమ్మ, తుంగతుర్తి