మిర్యాలగూడ, ఫిబ్రవరి 7: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా బీఆర్ఎస్, సీపీఎం అభ్యర్థుల ప్రచారంతో శనివారం మిర్యాలగూడ పట్టణ వీధులు హోరెత్తాయి. బీఆర్ఎస్, సీపీఎం అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, జూలకంటి రంగారెడ్డి శుక్రవారం సాయంత్రం పట్టణంలోని 22, 23, 24, 26, 27, 28, 39, 40 వార్డుల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమోతు భాస్కర్రావు మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కేవలం మిత్రపక్షాల అభ్యర్థులతోనే సాధ్యమన్నారు.
తాము గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు కళ్ల ముందే కనిపిస్తున్నాయన్నారు. మిగిలి ఉన్న సమస్యల పరిష్కారానికి, వార్డుల సుందీరీకరణకు బీఆర్ఎస్, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పట్టణంలో 48 వార్డుల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొంది పురపీఠంపై గులాబీ జెండా ఎగురవేద్దామన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో నయా పైసా అభివృద్ధి జరగలేదన్నారు.
ఆరు గ్యారెంటీలంటూ అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మిర్యాలగూడ పట్టణ ఓటర్లు బుద్ధి చెప్పి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని రాజ్యసభ మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ పిలుపునిచ్చారు. మరో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించే సమర్థవంతమైన అభ్యర్థులను బరిలో ఉంచామని, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు.