చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఉమ్మడి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వారం క్రితం 21 డిగ్రీలు ఉండగా నేడు 17 డిగ్రీలకు చేరింది. గరిష్ఠ ఉష్ణోగ్రత్తలు 33 నుంచి 35 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇటీవల వచ్చిన తుఫాన్ ప్రభావంతో చలిగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చలికి ఉదయం, సాయంత్రం ఇండ్ల నుంచి జనం బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. మార్కెట్లో స్వెటర్ల కొనుగోళ్లు పెరిగాయి. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి పంజా విసురుతున్నది. దాంతో జనం ఇండ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21 నుంచి 17 డిగ్రీలకు పడిపోయాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33 నుంచి 35 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. తెల్లవారుజామున 14 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. అల్పపీడన ప్రభావంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. మంచు దుప్పటి కమ్మేస్తుంది. ప్రజలు చలిమంటలు వేస్తూ ఉపశమనం పొందుతున్నారు. చలిగాలుల నుంచి రక్షణకు దుప్పట్లు, స్వెటర్లు కొనుగోలు చేస్తుండటంతో వాటికి గిరాకీ పెరిగింది.
-తిరుమలగిరి, డిసెంబర్ 13
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చలి క్రమంగా పెరుగుతున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు కనిపించకపోయినప్పటికీ కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో క్షీణ దశ కనిపిస్తుండటంతో చలి వణికిస్తుంది. ప్రధానంగా రాత్రిపూట, తెల్లవారుజామున చలి తీవ్రత గణనీయంగా ఉంటుంది. శీతాకాలం ప్రారంభంతో చలి ప్రభావం కనిసిస్తున్నది.
సాధారణంగా శీతాకాలం అక్టోబర్లో ప్రారంభమై జనవరితో ముగుస్తున్నది. చలి ప్రభావం మాత్రం డిసెంబర్లో ప్రారంభమై జనవరిలో తీవ్రంగా కనిపిస్తున్నది. పొరుగు రాష్ర్టాల్లో తుఫాన్ కారణంగా అక్కడి నుంచి చలి గాలులు వీయడం కూడా చలి పెరిగేందుకు ఒక కారణంగా కనిపిస్తుంది. గడిచిన వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21 నుంచి 17 డిగ్రీల మధ్యలో నమోదవుతుండగా తెల్లవారుజామున 14 నుంచి 16 డిగ్రీలకు పడిపోతున్నాయి.
చలి ప్రభావంతో బడి పిల్లలు స్వెటర్లతోనే బడిబాట పడుతున్నారు. వృద్ధులు అవి లేకుండా పొద్దున బయట కూర్చోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయాన్నే వ్యవసాయం, ఇతర పనులకు వెళ్లే వాళ్లు చలితో ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న కారణంగా జలుబు, దగ్గు, జ్వరం సోకే అవకాశం ఉండడంతో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలి కాలంలో ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. స్వెటర్లు ధరించాలి. అత్యవసరమైతే తప్పా తెల్లవారుజామున బయటకు వెళ్లకపోవడమే మంచిది. చిన్న పిల్లల పట్ల తల్లితండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇక వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం.
-వందన, పీహెచ్సీ వైద్యురాలు, తిరుమలగిరి