నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పాత పాటను తలపిస్తున్నది నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల పరిస్థితి. డాక్టర్లుంటే మందులు లేవు.. మందులుంటే టెస్టులు లేవు. డాక్టర్లు, టెస్టులు, మందులుంటే సదుపాయాలు కరువు. టెస్టులు, మందుల కోసం ప్రైవేట్‌కు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా చాలా దవాఖానల్లో ఇదే పరిస్థితి ఉండడంతో ప్రజలు దిక్కులేక ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న వేళ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీనికి తోడు నల్లగొండ జిల్లా జనరల్ దవాఖానలో ఇటీవల జరిగిన రెండు ప్రసవ ఘటనలు ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. సర్కారు దవాఖాన అంటేనే అమ్మో అనే పరిస్థితి వచ్చింది.
జిల్లాలో 30 శాతం మందే డాక్టర్లు
జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. 24 గంటల పాటు వైద్యసేవలు అందించే జిల్లా కేంద్ర దవాఖాన, నాలుగు ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్లు లేక ప్రజలకు సరైన వైద్యసేవలు అందడం లేదు. జిల్లా జనరల్ దవాఖాన మినహా మిగతా ఆస్పత్రుల్లో 217 మంది (సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్) వివిధ రకాల వైద్యులు ఉండాలి. కానీ 82 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో 20 మందిని కాంట్రాక్టు పద్ధతిన ఇటీవల ఎంపిక చేశారు. ఇంకా 135 మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా జనరల్ దవాఖానలో అన్ని విభాగాల్లో డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆరు విభాగాల్లో 77 మంది డాక్టర్లు, 42 మంది ఎస్ఆర్లకుగానూ 33 మంది మాత్రమే పనిచేస్తున్నారు. నరాల వైద్య నిపుణులు, నెప్రాలజిస్టులు, ఇతర పలు రకాల ప్రధాన డాక్టర్ల ఊసేలేదు.
దవాఖానల్లో మందుల కొరత
జిల్లా కేంద్ర దవాఖానలో మందుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. సాధారణ రోగాలకు కూడా మందులు అందుబాటులో లేవు. గ్యాస్ ఫామ్ అయితే తగ్గడానికి వాడే పాంటాబ్ ట్యాబ్లెట్లు లేవు. కడుపు నొప్పికి డైక్లోఫామ్ ఇంజక్షన్తోపాటు ట్యాబ్లెట్ కూడా లేవు. కాళ్లు, చేతుల వాపు, దురదకు వాడే లోషన్ సైతం లేవని ఫార్మాసిస్టు చెబుతున్న పరిస్థితి పెద్దాస్పత్రిలో కనిపిస్తున్నది. ‘అదే మంటే స్టేట్ నుంచే రావడం లేదు, మేం చేయం, ఇండెంట్ పెట్టాం, ఇంకా రాలేదు’ అని సమాధానం
చెబుతున్నారు.
ల్యాబ్‌లో అంతంత మాత్రంగానే పరీక్షలు
జిల్లా జనరల్ దవాఖానలో రక్త, మూత్ర, షుగర్ పరీక్షలు అంతంత మాత్రంగానే చేస్తున్నారు. పరీక్షలకు కావాల్సిన కిట్లు అందుబాటులో లేకపోవడం వల్ల బయటకు రాస్తున్నారు. దవాఖానలో వివిధ శస్త్రచికిత్సలకు వచ్చిన రోగులకు మాత్రమే జిల్లా ప్రయోగశాలలో పరీక్షలు చేస్తున్నారు. సాధారణ జ్వరం, సీజనల్ వ్యాధులతో వచ్చిన వారికి మాత్రం బయట చేయించుకోవాలని చెబుతున్నారు. గత ప్రభుత్వం టీ హబ్‌ను ఏర్పాటు చేసి 134 రకాల వైద్య పరీక్షలు చేయాలని నిర్దేశించినప్పటికీ అవి పేపర్లకే పరిమితయ్యాయి. ఎక్కడా సక్రమంగా కార్యరూపం దాల్చడం లేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల నుంచి వచ్చిన వాటికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు.
విధుల్లో చేరిన ఎంసీహెచ్ వైద్యులు
నాలుగు రోజుల కితం నల్లగొండ జిల్లా మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో కుర్చీలోనే గర్భిణి ప్రసవించిన సంఘటనపై జిల్లా యంత్రాంగం నుంచి చర్యలకు ఆదేశాలు జారీ చేయడంతో ఎంసీహెచ్ డాక్టర్లు సాముహికంగా సెలవులు పెట్టారు. మూడు రోజుల నుంచి వారంతా సెలవుల్లోనే ఉన్నారు. అరకొర సిబ్బందితో డెలివరీ చేస్తున్న సమయంలో ఆదివారం గర్భస్థ శిశువు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక దవాఖానలో వైద్యసేవలు పూర్తిగా నిలిచిపోవడంతో కలెక్టర్ నారాయణరెడ్డి స్వయంగా వైద్యులతో మాట్లాడారు. డాక్టర్లకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. 80 బెడ్లకు 200 మంది రోగులు వస్తుండడంతో ఇబ్బంది అవుతుందని, సిబ్బంది సరపడా లేరని, సెక్యూరిటీ కూడా సమస్యగా ఉందని డాక్టర్లు చెప్పడంతో వాటన్నింటనీ పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. దాంతో డాక్టర్లు విధుల్లో చేరారు.