సూర్యాపేట, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): కేజీబీవీ, రెసిడెన్షియల్ కళాశాలల్లో తరచుగా ఆకస్మిక తనిఖీలు చేస్తామని, ఎక్కడైనా ఎవరైనా విధుల్లో లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, విద్యార్థుల హాజరు వివరాలపై ప్రతి రోజూ నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్, కేజీబీవీ పాఠశాల్లో చదివే ప్రతి విద్యార్థికి పది, ఇంటర్లో 70 శాతానికి పైనే ప్రతి సబ్జెక్టులో మార్కులు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు.
కలెక్టరేట్లోని వీసీ హాల్లో మంగళవారం కలెక్టర్ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, మౌలిక సదుపాయలు కల్పించాలన్నారు. సమావేశంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ అధికారులు శంకర్, దయానందరాణి, డీడబ్ల్యూవో నరసింహారావు, డీఈవో అశోక్ తదితరులు ఉన్నారు.