నాలుగో విడుత రుణమాఫీ అంటూ రైతుల పేర్లతో విడుదల చేసిన లబ్ధిదారుల జాబితాపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా గొప్పల కోసం మరో విడుత రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యవసాయ శాఖ నుంచి లబ్ధిదారుల జాబితాలు, వాటికి సంబంధించిన డబ్బు మొత్తం ఎంతో కూడా అదే సమయంలో అట్టహాసంగా ప్రకటించారు. దాంతో వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న రుణమాఫీ లబ్ధిదారుల్లో కొందరు ఆలస్యమైనా రుణమాఫీ వచ్చిందని ఊపిరి పీల్చుకున్నారు. రెండు, మూడ్రోజుల్లో తమ ఖాతాల్లో మాఫీ డబ్బులు జమ అవుతాయని ఆశ పడ్డారు. కానీ వీరి ఆశలు నేటికీ నెరవేరలేదు. నాలుగో విడుదల రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేసి 20 రోజులు గడుస్తున్నా నేటికీ ఒక్క రైతుకూ ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. పైగా ఆర్ధిక భారం తప్పించుకునేందుకు లబ్ధిదారుల జాబితాను కుదించేందుకు ప్రభుత్వం రహస్యంగా సర్వే చేస్తున్నట్లు తెలిసింది. దాంతో సీఎం ప్రకటనకు, ఆ వెంటనే వెలువడిన జాబితాకే దిక్కు లేకపోతే ఎలా అని రైతులు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జూలై నుంచి మొదలుపెట్టిన రుణమాఫీ పథకం అంతులేని కథగా కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 15 నాటికి మూడు విడుతలుగా రుణమాఫీ చేయగా, ఉమ్మడి జిల్లాలో ఇంకా సుమారు రెండున్నర లక్షల మంది అర్హులైన రైతులు మిగిలి ఉన్నారు. రేషన్ కార్డును ప్రమాణీకం తీసుకోవడంతోపాటు రేషన్ కార్డు లేకపోవడం, పేర్లు, ఆధార్ నెంబర్లు, పట్టాదార్ పాస్ పుస్తకాల నెంబర్ల నమోదులో తప్పిదాల పేరుతో వీరిని పక్కన పెట్టేశారు. దాంతో మిగిలిన రైతులంతా నిత్యం ఆందోళనలకు దిగడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే గత నెల 30న నాలుగో విడుత రుణమాఫీ పేరుతో ప్రభుత్వం ప్రకటన చేసింది. జిల్లాల వారీగా రేషన్ కార్డు లేని 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల పేర్లతో జాబితాలు విడుదల చేస్తూ మాఫీ మొత్తాన్ని ప్రకటించింది. నాలుగో విడుతలో నల్లగొండ జిల్లాలో 21,432 మంది రైతులకు గానూ రూ.236.90 కోట్ల రుణాలను, సూర్యాపేట జిల్లాలో 15,009 మంది రైతులకు గానూ రూ.132 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఇదే విషయాన్ని ఈ నెల 7న నల్లగొండలో జరిగిన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి గొప్పగా ప్రకటించారు. దాంతో జాబితాలో ఉన్న నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన 36,441 మంది రైతులు రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిగో.. అదిగో అనడమే తప్ప నేటికీ ఒక్క రూపాయి కూడా రైతుల అకౌంట్లలో జమ కాలేదు. అంటే, ప్రభుత్వమే ఇప్పటికీ ఒక్క పైసా కూడా నాలుగో విడత రుణమాఫీ కోసం విడుదల చేయలేదన్న మాట. సీఎం రేవంత్‌రెడ్డి మాటలతో రైతులంతా 20 రోజులుగా బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎవ్వరూ కూడా రైతుల గోడును పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారులు కూడా నోరు మెదపడం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే మీ అకౌంట్లలో మాఫీ డబ్బులు జమ అవుతాయని మాత్రమే చెప్తున్నారు. అవి ఎప్పుడు వస్తాయనే దానిపై మాత్రం ఎవ్వరూ స్పందించడం లేదు. నిత్యం రైతులు వచ్చి వ్యవసాయ అధికారులు, బ్యాంకు సిబ్బందిని ప్రశ్నిస్తుంటే వాళ్లు విసుక్కుంటున్న పరిస్థితులు
నెలకొన్నాయి.
లబ్ధిదారుల సంఖ్య కుదింపునకు ఆదేశాలు
మొదటి నుంచీ లబ్ధిదారుల సంఖ్యను ఎంత వీలైతే అంతలా కుదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగో విడుతపైనా ప్రభుత్వం కన్నేసింది. విజయోత్సవాల్లో ప్రకటించిన జాబితాకు కత్తెర వేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ జాబితాలోని లబ్ధిదారుల వివరాలను సేకరించేందుకు రహస్య సర్వే చేస్తున్నట్లు తెలిసింది. ఈ జాబితాలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా లేదా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఉన్నా సరే వారందరినీ గుర్తించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను ట్రెజరీ కార్యాలయాల ద్వారా సేకరిస్తుండగా, ఐటీ చెల్లింపుదారులను సంబంధిత శాఖ ద్వారా గుర్తించే పనిని చేపట్టారు. ఈ తొలగింపు పనిని వ్యవసాయ శాఖ ద్వారా చేపట్టాలని ముందుగా భావించినా వారూ క్షేత్రస్థాయి పరిస్థితుల నేపథ్యంలో దీనికి ససేమిరా అన్నట్లు తెలిసింది. జాబితాల నుంచి తొలిగిస్తే స్థానికంగా రైతుల నుంచి తాము ఇబ్బందులు పడుతామని చెప్పడంతో వేరే విభాగాల ద్వారా ఏరివేత ప్రక్రియను వేగవంతం చేసినట్లు సమాచారం. ఇది పూర్తయ్యాకే నాలుకో విడత రుణమాఫీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది.
రైతుల ఆగ్రహం
నాలుగో విడత రుణమాఫీకి సంబంధించి అంతా గోప్యత పాటిస్తుండడంతో రైతులు తీవ్రంగా మండి పడుతున్నారు. దీనిపై ఏ అధికారిని అడిగినా తమకు తెలియదంటూ దాట వేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అట్టహాసంగా ఏడాది ప్రజా పాలన ఉత్సవాల్లో ప్రకటించి ఇప్పుడు ప్రజాప్రతినిధులు సైతం నోరు మెదపక పోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే జాబితా ప్రకారం రుణమాఫీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నాలుగో విడతలోని కొద్దిమంది రైతుల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా మిగిలి ఉన్న రైతుల సంగతి ఏంటన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇంకా సాంకేతిక తప్పులతోపాటు రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులంతా మాఫీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. వారిందరికీ రుణమాఫీ జరిగేనా, లేదా? అన్నది వేచి చూడాల్సిందే.
మొదటి విడుత నుంచి ఎదురుచూస్తున్నా
ఒకే సారి రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది. రుణమాఫీ విషయంలో ఒక విధానం అన్నదే లేకుండా పోయింది. నేను వ్యవసాయ అవసరాల కోసం లక్షా 9వేల రూపాయలను బ్యాంకులో రుణం తీసుకున్నాను. అది మాఫీ అవుతుందని మొదటి విడుత నుంచి చూస్తూనే ఉన్నాను. ఇప్పటికీ కాలేదు. అసలు రుణ మాఫీ అవుతుందన్న నమ్మకమే పోతున్నది. పైగా బ్యాంకు వాళ్లు వడ్డీ వేస్తున్నారు. సీఎం రేవంతరెడ్డివి మాటలే తప్ప అమలు చేయడం లేదు. రుణ మాఫీ కాకపోవడం వల్ల కొత్త రుణం ఇవ్వడం లేదు. పంట పెట్టుబడికి డబ్బులు లేక ప్రైవేట్‌లో ఎక్కువ మిత్తికి అప్పులు తీసుకోవాల్సి వస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అకౌంట్లో జమ చేసేది. రైతుకు దెవలాట లేకుండే. కాంగ్రెస్ పాలనలో రైతుల కథ మొదటికి వచ్చింది.
-తిప్పన ప్రతాప రెడ్డి, రైతు, సుబ్బరెడ్డిగూడెం, మిర్యాలగూడ మండలం (మిర్యాలగూడ రూరల్)