కోదాడ /కోదాడటౌన్ : భారీ వర్షంతో కోదాడ పట్టణంలో జన జీవనం అస్తవ్యస్తమైంది. పట్టణంలోని 28వ వార్డుతోపాటు షిరిడీ సాయి నగర్, భవానీనగర్ ప్రాంతా ల్లో నీరు ఇండ్లలోకి ప్రవేశించడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. రహదారులు సైతం దెబ్బతిన్నాయి. 28వ వార్డులో పల్లెబోయిన నాగరాజు ఉమారాణిలకు చెందిన సుమారు రూ. 1.60 లక్షల విలువ గల బర్రెలు వరద ప్రవాహంతో మృతి చెందాయి. భవానీనగర్‌లో ఓ ఇంటి ప్రహరీ సైతం కూలింది. 200లకు పైగా ద్విచక్ర, కార్లు వరద నీటిలో మునిగి మరమ్మతులకు గురయ్యాయి. ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీని గత 10 రోజుల నుంచి మరమ్మతులు చేపట్టంతో వర్షం నీరు షాపింగ్ కాంఫ్లెక్స్లోకి ప్రవేశించి సెల్లార్లో 4 నుంచి 5 అడుగుల మేర నీరు నిలిచింది. దాంతో కొన్ని కాంప్లెక్స్‌లలో వివిధ రకాల వ్యాపారాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
రూ. 50 లక్షలు ఆస్తి నష్టం జరిగింది
శనివారం కురిసిన వర్షంతో మా షాపులోకి వరద నీరు చేరింది. 7 అడుగుల మేర నీరు ఉండడంతో ఎరువుల కట్టలు మొత్తం నీటిలో తడిచి కరిగిపోయినాయి. నాట్ల సీజన్ కావడంతో ఇటీవలే ఎరువుల సంచులను తెప్పించాం. వాటి విలువ సుమారు 50 లక్షల వరకు ఉంటుంది. డ్రైనేజీలు చిన్నగా ఉండడంతో నీళ్లు ఎటు పోలేక దుకాణాల్లోకి చేరాయి. అధికారులు మరల ఇటువంటివి జరుగకుండా చర్యలు తీసుకోవాలి.
-ఓరుగంటి వెంకటేశ్వర్లు, యాజమాని లక్ష్మి ఫర్టిలైజర్స్, కోదాడ.