నందికొండ, జూలై 10 : శ్రీశైలం ద్వారా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం రోజుకు 5 అడుగుల మేర పెరుగుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 600 అడుగులకు గాను 546 అడుగుల వద్ద నుంచి క్రస్ట్ గేట్ల నిర్మాణం ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం 590 అడుగులకు గాను 540.60 ( 189.58 టీఎంసీలు) వరకు ఉంది. ఇదే స్థాయిలో వరద శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కొనసాగితే శుక్రవారం నాటికి సాగర్ డ్యాం క్రస్టు గేట్ల లెవల్ 546 అడుగులకు చేరి డ్యాం గేట్లను వరద నీరు తాకనున్నది. శ్రీశైలం రిజర్వాయర్‌కు 161325 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా డ్యాం 3 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 80100 క్యూసెక్కుల నీటిని సాగర్ రిజర్వాయరకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 120813 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా ఎడమకాల్వ ద్వారా 3202 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ డ్యాం నుంచి 4702 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది.
సాగర్‌కు వరద నీరు వచ్చి చేరుతున్నందున విద్యుత్ ఉత్పతి చేపట్టేందుకు సిద్ధం గా ఉండాలని హైడల్ డైరెక్టర్ బాలరాజు అధికారులకు సూచించారు. నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, ఎమ్మార్పీ, ఎడమ కాల్వ జల విద్యుత్ కేంద్రాలను గురువారం పరిశీలించారు. ప్రధాన జలవిద్యుత్ కేంద్రలో మొదటి టర్బైన్‌కు రూ.7.50 కోట్లతో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని, ఈనెల 31లోగా మరమ్మతు పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పతిని ప్రారంభిస్తామన్నారు. ఎడమ కాల్వ జలవిద్యుత్ కేంద్రం ద్వారా శుక్రవారం నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వరద నీరు వచ్చి చేరినందున ఈ సీజన్లో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్ప త్తి చేపడతామన్నారు. అంతకు ముందు ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి వచ్చిన హైడల్ డైరెక్టర్ బాలరాజుకు సీఈ మంగేశ్‌కుమార్ స్వాగతం పలికారు.