యాదగిరిగుట్ట, ఏప్రిల్ 24: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో భవానీశంకర్ శుక్రవారం వెల్లడించారు. పాతగుట్ట(పూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ 27 నుంచి 30వ తేదీ వరకు, అనుబంధ ఆలయం దబ్బగుంటపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి జయంత్యోత్సవాలు వైభవంగా చేపట్టనున్నామని తెలిపారు. 26, 27న లక్ష పుష్పార్చనలో పాల్గొనే దంపతులు రూ.2 వేల టికెట్ తీసుకోవాలని సూచించారు.
ఆ దంపతులకు శ్రీస్వామివారి శేషవస్త్రం, శెల్లా కనుము, మహాప్రసాదం అభిషేక లడ్డు అందజేస్తామని తెలిపారు. 26 ఉదయం 8 గంటలకు విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షాబంధనం, ఋత్విక్ వరణం, శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి అలంకార సేవతో యాగశాల ప్రవేశం, సాయంత్రం 6.30 గంటలకు తిరు వేంకటపతి అలంకార సేవ పురవీధి సేవ, సాయమారాధన నిత్యహవనం 27న ఆస్థాన మంటపంలో లక్ష పుష్పార్చన, ఉదయం 9 గంటలకు యాగశాలలో ద్వారతోరణ పూజ, మూర్తికుంభారాధన, సాయంత్రం 6.30 గంటలకు కాళీయ మర్ధన అలంకార సేవ, పురవీధి సేవ, 28న ఉదయం 9 గంటలకు యాగశాలలో ద్వారతోరణ పూజ, గరుఢ మూల మంత్ర హోమాలు, సాయంత్రం 6.30 గంటలకు గరుఢ వాహనంపై పరవాసుదేవ అలంకారం పురవీధి సేవ,
లక్ష్మీనృసింహ సుదర్శన గరుఢ మూలమస్త్ర హవనం, 29న ఉదయం 9 గంటలకు యాగశాలలో ద్వార తోరణ, మూర్తి కుంభారాధన, గరుఢ సుదర్శన శతకం సహిత మూలమంత్ర హోమాలు, సాయంత్రం 6.30 గంటలకు శ్రీరామావతార అలంకార పురవీధి సేవ, సాయమారాధన, 30న ఉదయం 9 గంటలకు యాగశాలలో ద్వార తోరణం, మూర్తి కుంభారాధన, గరుఢ సుదర్శన శతకం సహిత మూలమంత్ర హోమాలు, సాయం త్రం 6.30 గంటలకు అర్చన, వేదస్వస్తి, మహానివేదన పూజలు ఉంటాయని చెప్పారు. పాతగుట్ట(పూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 27న ఉదయం స్వస్తివాచనం, సాయంత్రం 6 గంటలకు మృత్సం గ్రహ ణం, అంకురారోపణం, 28న ఉదయం యాగశాలలో ద్వారతోరణ పూజ, 29న ఉదయం ప్రాతరారాధన, నిత్యపూర్ణాహుతి, లక్షపుష్పార్చన, సాయంత్రం సాయమారాధన, 30న ఉదయం 8 గంటలకు యాగశాలలో చతుఃస్థానార్చన, అష్టోత్తర శతఘటాభిషేకం, సాయంత్రం 6 గంటలకు సాయమారాధన ఉంటాయని తెలిపారు.