నల్లగొండ, అక్టోబర్ 28: కాంట వేయని ధాన్యం ఒకవైపు…కాంట వేసినా రవాణా చేయని ధాన్యం మరోవైపు.. ఇలా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం మొంథా తుఫాన్‌తో ఆగమాగమైంది. నల్లగొండ నియోజక వర్గంలోని ఆరు హాకా, ఆరు మ్యాక్స్ సెంటర్లు ఉండగా మొత్తగా 10 సెంటర్లల్లో ధాన్యం తడిసి ముద్ద కాగా…మరో 18 పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నల్లగొండలోని చర్లపల్లి హాకా సెంటర్లో టార్పాలిన్ పట్టాలు కూడా అందుబాటులో లేకపోవటంతో పెద్దమొత్తంలో ధాన్యం తడిసింది.
పానగల్‌కు చెందిన యశోద పది రోజులుగా, చిన్న సూరారానికి చెందిన కారింగుల యాదయ్య 20 రోజులుగా, మరో రైతు కొడతాల రాములు 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి ఎదురు చూస్తున్నా నిర్వాహకులు కాంటా పెట్టకపోవటంతో ఆరిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ఇక ఆర్జాలబావి పీఏసీఎస్ సెంటర్‌తో పాటు, ఖాజీరామారం, తిప్పర్తి, చందనపల్లి, వెంకటాద్రిపాలెం, జీ చెన్నారం, నర్సింగ్ బట్ల, కనగల్ కేంద్రాల్లోని ధాన్యం కూడా పూర్తిగా తడిసిపోయింది. రెండు సెంటీమీటర్ల వర్షానికే ఇలా ఉంటే ఇంతకన్నా భారీ వర్షాలు కురిస్తే ధాన్యం ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. అధికారులు పూర్తి స్థాయిలో టార్పాలిన్లు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా నల్లగొండ మండలం జీ చెన్నారంలో కాంటా వేసిన ధాన్యాన్ని కూడా తరలించకపోవటంతో ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది.

కాంటా వేసినా తరలించలే…
నేను రెండెకరాల్లో పండించిన ధాన్యాన్ని 20 రోజుల కింద మా గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తెచ్చి ప్రతి రోజూ ఆరపెడితే రెండు రోజుల క్రితం తేమ రావటంతో కాంటా పెట్టారు. అయితే సీరియల్ ప్రకారం కాంట పెట్టిన ధాన్యాన్ని కూడా తరలించ లేదు. వర్షం వస్తుందని అందులో పనిచేసే సిబ్బందికి తెలిసినా పట్టించుకోకుండా వారివి, వారి బంధువుల ధాన్యం లారీల్లో తీసుకెళ్లి మావి ఇక్కడే ఉంచడంతో తడిసి ముద్దయింది. ఇప్పుడేమో ఆరిన తర్వాతే తీసుకెళ్తాం.. అప్పటి వరకు మీదే బాధ్యత అంటున్నారు. ఇది చాలా అన్యాయం.
-దుబ్బాక మధుకర్, జీ చెన్నారం, నల్లగొండ మండలం
పూర్తిగా ఆరినా.. కాంటా పెట్టడం లేదు…
నేను 15రోజుల కింద చర్లపల్లి బైపాస్ హాకా సెంటర్‌కు ధాన్యం తీసుకొచ్చా. ధాన్యం పూర్తిగా ఆరినా కాంటా పెట్టకుండా సిబ్బంది తమకు తెలిసిన వారివే పెడుతున్నారు. ఇయ్యాల వర్షం వచ్చి ధాన్యం మళ్లీ తడిసింది. ఏం చేయా లో అర్థం కావటం లేదు. తేమ చూడగానే కాంటా పెట్టకుండా నిర్వాహకులు జాప్యం చేయటంతో పాటు కాంటా వేసిన ధాన్యాన్ని కూడా వెంటనే మిల్లులకు తరలిస్తలేరు.
ఇప్పుడేమో మళ్లీ ఆరిన తర్వాతే వేస్తాం అంటుండ్రు. అప్ప టి వరకు మీదే బాధ్యత అంటున్నారు. మా వడ్లు ఎప్పుడో ఆరినయ్. అప్పుడే కాంటా పెడితే బాగుండు.
– టేకుల వెంకటయ్య, పానగల్