సూర్యాపేట, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారింది. సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు తదితర పనులు చేపట్టిన చిన్న కాంట్రాక్టర్లకు రెండేండ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఒక పక్క బిల్లులు ఇవ్వకుండా ప్రభు త్వం సతాయిస్తుండగా, మరో పక్క పనుల కోసం ఇండ్లు, ఆస్తులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టడంతో ఆ ఇండ్లను జప్తు చేసేందుకు బ్యాంకులు కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తున్నాయి. దీంతో కాంట్రాక్టర్లు అసలు ‘మాకు బిల్లులు ఇస్తరా.. లేక చావమంటరా’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేండ్లుగా తమకు ఇచ్చిన చెక్కులు ట్రెజరీల్లో మూలుగుతున్నాయని వారు పేర్కొంటున్నారు. కాంట్రా క్టు పనుల విషయానికి వస్తే కమీషన్ల కోసం సిస్టమ్‌నే మార్చేశారు. గత బీఆర్ఎస్ హయాం లో పెద్ద పనులు ఉంటే వాటిని విడదీసి, చిన్న కాంట్రాక్టర్లకు అప్పగించి పనులు పూర్తయిన వెంటనే బిల్లులు ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పలు పనులను ప్యాకేజీలా మార్చి ఒకే పెద్ద కాంట్రాక్టర్‌కు అప్పగించి పనులు చేయిస్తున్నారు. ఇక బిల్లుల విషయానికి వస్తే పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే కమీషన్ తీసుకొని ఇస్తున్నారే తప్ప లక్షల్లో పనులు చేసిన వారికి ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు కూడా బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.10 లక్షల నుంచి 40 లక్షల లోపు డ్రెయి న్లు, సీసీ రోడ్లు, కల్వర్టులు తదితర చిన్న పను లు చేసిన కాంట్రాక్టర్లకు రెండేళ్లుగా బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది. అధికార పార్టీ నాయకుల పరిచయాలతో కొంతమందికి మాత్రం బిల్లులు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రం లో చేపట్టిన పనులకు కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించగా ఎన్నికల సంవత్సరమైన 2023 చివరి ఆరు నెలల్లో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పను లు పూర్తయినా ప్రభుత్వం చెల్లించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. జిల్లాలో 32 మంది చిన్న కాంట్రాక్టర్లకు రూ.35 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అయితే వారికి చెక్కులు ఇచ్చారే కానీ డబ్బులు మాత్రం అందడం లేదు.