పెన్పహాడ్, జూన్ 12 : భూ సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్డీఓ వేణుమాదవ్రావు అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం ధూపహాడ్ గ్రామంలో గురువారం తాసీల్దార్ లాలూ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనఖీ చేశారు. పలువురి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని వారి వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నదని, సుధీర్ఘకాలంగా పరిష్కారం కాని రెవెన్యూ సమస్యలు పరిష్కరించుకుకోవచ్చన్నారు. భూ భారతి చట్టం ప్రజలకు, రైతులకు ఉపయోగపడేలా ఉందన్నారు. రెవెన్యూ సిబ్బంది మీకు అండగా ఉంటూ, మీ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.
ధూహాడ్ గ్రామంలో రేషన్ దుకాణంలో సన్న బియ్యం మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయడంపై ఆర్డీఓ తనిఖీ చేశారు. చౌక ధరల దుకాణాలు సమర్థవంతంగా పనిచేయాలని, లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని ఆదేశించారు. చౌక దుకాణాల పనితీరును పర్యవేక్షించడం, పీడీఎస్ ప్రయోజనాలు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూడటం కోసం నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రంజిత్ రెడ్డి, ఏఆర్ఐ అజీజ భేగం, సీనియర్ అసిస్టెంట్ రాధ పాల్గొన్నారు.