పెన్పహాడ్, సెప్టెంబర్ 10 : గత నెల రోజుల నుంచి వరి నాట్లు వేసిన రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా చేయక పోవడంతో పొలాల్లో ఉండాల్సిన రైతులు రైతు సహకార కేంద్రాల వద్ద రోజుల తరబడి ఉదయం, రాత్రీ పగలు పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా యూరియా దొరకక పోవడంతో కడుపు మంటతో రగిలి పోతున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వేంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పెన్పహాడ్ మండల రైతుల దుస్థితి చూసి చిదేళ్ల సహకార సంఘం కార్యాలయం ముందు రైతులతో కలిసి పెద్ద ఎత్తున రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో ప్రైవేట్ నానో కంపెనీలకు లొంగిపోవడం వల్ల డిమాండ్ ఆధారంగా ఇండెక్స్ 72 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల యూరియాను 62 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల యూరియా వరకే ఇండెక్స్ పెట్టడం రైతుల పట్ల చూపిస్తున్న సవతి తల్లి ప్రేమ మాత్రమేనని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు బీజేపీ మంత్రులు ఉండి కూడా రాష్ట్రానికి రావాల్సిన యూరియాను తెప్పించడంలో పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. చిన్న, సన్న కారు దళిత, గిరిజన రైతులు బయట కొనలేక ఇప్పటికే ఎకరానికి రూ.30 వేలు ఖర్చు చేసి వరి సాగు చేస్తే ఒక్క యూరియా బస్తా కోసం రైతులు రోడ్ల మీదకు రావల్సిన పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. పెన్పహాడ్ మండలంలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోతే మళ్లీ రైతుల తరుపున పోరాటం చేస్తామని నెమ్మాది హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటి సభ్యులు ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, మండల కార్యదర్శి గుంజ వెంకటేశ్వర్లు, మండల నాయకులు రనపంగి కృష్ణ, నెమ్మాది అడివయ్య, ఇరుగు రమేశ్, ఫీరయ్య, భోగరాజు శ్రీకాంత్, ముత్తయ్య, శివ, లక్ష్మయ్య, లక్ష్మమ్మ, నాగు, వెంకన్న, సోమయ్య, వెంకటమ్మ, జానీ పాల్గొన్నారు.