చందంపేట, మే 17: ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసిన రైతన్న ధాన్యం అమ్ముకునేందుకు గోస తీస్తున్నాడు. వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 15 రోజులుగా లారీల కొరత సాకు చూపుతూ కొనుగోలు చేయడం లేదు. అధికారులు కనీసం మ్యాచర్ చూడడం లేదు. ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని చందంపేట మండలంలోని పోలేపల్లి వద్ద గల ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో.. తమ వడ్లు తడుస్తాయోనని రైతులు అయోమయంలో ఉన్నారు. మండలంలోని దేవరచర్ల, యల్మలమంద, రేకులగడ్డ, యాపలపాయతండా, పోలేపల్లి తదితర గ్రామాల నుంచి వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన రైతులు ఎప్పుడు కొంటారని దీనంగా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంటోంది.
కేంద్రంలోనే 10 వేల క్వింటాళ్ల ధాన్యం
లారీల కొరత కారణంగా కొనుగోలు చేసిన ధాన్యం తరలించకపోవడంతో పాటు ఇంకా 10 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు సుమారు 555 మంది రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చారు. ఇందులో నుంచి 180 మంది రైతుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం నిరీక్షిస్తున్నారు. కొనుగోలు కేసిన ధాన్యాన్ని 1,400 బస్తాల్లో నింపి ఉంచినా లారీలు లేకపోవడంతో దిగాలుగా ఎదురు చూస్తున్నారు. మిల్లర్లు ధాన్యాన్ని తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేయడం, లారీల కొరత కారణంగా ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోంది.
పట్టించుకోని అధికారులు
ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లను తీసుకొచ్చి నానా కష్టాలు పడుతున్నామని, కొనుగోలు కేంద్రంలో కనీసం తాగునీరు లేదని, నిప్పులాంటి ఎండలను తట్టుకోలేక ఆపసోపాలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ్యాచర్ చూసేందుకు ఎప్పుడు వస్తారో చెప్పడం లేదు. ధాన్యం కొనుగోలు ఊసే ఎత్తడం లేదని రైతులు వాపోతున్నారు.
18 రోజులైనా కొనలేదు
నా ఊరు దేవరచర్ల నుంచి వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 18 రోజులు గడిచినా కొనుగోలు ఊసే ఎత్తడం లేదు. నాకున్న రెండు ఎకరాల్లో వరి సాగు చేశా. పంటను అమ్ముకునేందుకు ఆపసోపాలు పడాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. వడ్లకు కాపలాగా ఇక్కడే ఉంటున్న. వర్షం వస్తే నా కష్టం మొత్తం వర్షంపాలయ్యే ప్రమాదం ఉంది.
-కేతావత్ మధు, దేవరచర్ల
15 రోజులుగా నిరీక్షిస్తున్న
నేను 300 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి పదిహేను రోజులు గడిచింది. కనీసం బస్తాలు కూడా ఇవ్వడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. లారీలు లేవని గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం సరికాదు. వర్షం పడితే రైతులు ఆగమైతరు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి.
-కేతావత్ రమేష్, దేవరచర్ల
లారీలు వస్తలేవు
పోలేపల్లి స్టేజీ వద్ద గల ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో పాటు ధాన్యం స్టాక్ ఉందని మిల్లర్లు చెబుతుండడంతో కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోంది.
-లక్ష్మణ్, కొనుగోలు కేంద్రం సిబ్బంది