చందంపేట(దేవరకొండ) : విద్యారంగంలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాను రోల్‌మోడల్‌గా నిలుపాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. ఐదు రోజల ఉపాధ్యాయుల ఐక్య వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దేవరకొండతో పాటు నియోజకవర్గంలోని చందంపేట, కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ము మండలాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల మండల స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రైవేటు సంస్థల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. విద్యార్థులకు అక్షర జ్ఞానంతో పాటు సామాజిక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి మూడు నెలలకోసారి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ, మే 23 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులందరూ వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిలో బోధనా సామర్థ్యాలు పెంపొందేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సహాయ, సహకరాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక బోధనా పద్ధతుల అమలు కోసం ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఎంతగానో ఉపయోగ పడుతుందని డీఈఓ భిక్షపతి అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం దామరచర్ల, మిర్యాలగూడ, అడవిదేవులపల్లి మండలాలకు చెందిన ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. విద్యాశాఖ ఆదేశానుసారం పాఠశాలల పునః ప్రారంభానికి ముందే ప్రతి ఉపాధ్యాయుడు ఐదు రోజులు శిక్షణ పొంది ఉండాలని సూచించారు. శిక్షణ అంశాలను ఉపాధ్యాయుల నుంచి అడిగి తెలుసుకున్నారు. శిక్షణ ప్రదేశాల్లో వసతి, భోజన సౌకర్యం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయిలోనే గుణాత్మక విద్యను అమలుపర్చి తల్లిదండ్రుల కోరిక మేరకు ఆంగ్ల మాధ్యమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థులకు తెలుగులో ధారాళంగా చదువడం, రాయడం వంటి నైపుణ్యాన్ని మెరుగు పర్చాలన్నారు. జూన్ 6 నుంచి ఉపాధ్యాయులందరూ బడిబాట కార్యక్రమంలో పాల్గొని ఆవాస ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులను కలిసి నాణ్యమైన విద్యపై భరోసా కల్పించి పిల్లల పేర్లు నమోదు చేయించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓలు లావూరి బాలు, ఎం.బాలాజీనాయక్, ఆర్.వరలక్ష్మి పాల్గొన్నారు.
చిట్యాల : ఉపాధ్యాయులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను పాఠశాలల్లో అమలు చేయాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీ రాధారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు నాలుగో రోజు శుక్రవారం రాధారెడ్డి, డీఈఓ భిక్షపతి వేర్వేరుగా సందర్శించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సైదా నాయక్, రిసోర్స్ పర్సన్స్ కరుణాకర్, అశోక్ రెడ్డి, అంజయ్య, రెహనా కౌసర్, విజయ్, కృష్ణ పాల్గొన్నారు.
పెద్దవూర, మే 23 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ తరి రాములు అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన సందర్శించి మాట్లాడారు. అనంతరం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ రవిని సన్మానించారు. కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్ దైదా రవి, డీఆర్పీ ఇరుమాది పాపిరెడ్డి, మండల నోడల్ అధికారి శేషు, ఎంఆర్పీ దేవేందర్, దుర్గాప్రసాద్, నరేందర్, జాహెదాబేగం, నర్సింహాకుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రామగిరి, మే 23 : పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అర్థశాస్త్రం అంశాలను పరిపూర్ణంగా వివరించి దానిపై పట్టు సాధించేలా చేయాలని ప్రముఖ విశ్రాంత అర్థశాస్త్ర అధ్యాపకుడు, నల్లగొండ ఎకానామిక్స్ ఫోరం వ్యవస్థాపకుడు డాక్టర్ అక్కెనపల్లి మీనయ్య అన్నారు. నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోనెన్స్ స్కూల్లో నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణకు ఆయన హాజరై అర్థశాస్త్రంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి రామచంద్రయ్య, టీచర్స్ పాల్గొన్నారు.