నల్లగొండ ప్రతినిధి, మే 9 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న ఆటంకాలపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లలో జిల్లా అగ్రస్థానంలో ఉన్నా మిగిలి ఉన్న దానిని సైతం త్వరగా కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్లో రైస్ మిల్లర్లు, ట్రాన్‌పోర్ట్ ఆపరేటర్స్, పౌరసరఫరాల శాఖ, డీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, అదనపు జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల తీరు, ఇప్పటి వరకు కొన్న ధాన్యం, ఎగుమతులు, మిల్లు పాయింట్స్ వద్ద దిగుమతి, లారీల ఏర్పాటు, తదితర అంశాలపై చర్చించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా అయిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకు అవసరమైన లారీలను సప్లయ్ చేయాల్సిన బాధ్యత ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లదేనని తెలిపారు.
నల్లగొండ నియోజకవర్గంలోని మూడు మండలాలు, నల్లగొండ మండలంలో రోజు 150 లారీలు, తిప్పర్తి మండలంలో 80 లారీలు, కనగల్ మండలంలో 100 లారీల చొప్పున లారీలను కాంట్రాక్టర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొన్న ధాన్యాన్ని జాప్యం లేకుండా సెంటర్ల నుంచి మిల్లులకు తరలించాలని ఆయన సూచించారు. ఇక కొనుగోళ్లల్లో జిల్లా రైస్ మిలర్ల పాత్ర చాలా కీలకమని చెప్పారు. ఇప్పటికే వారు అందిస్తున్న సహకారంతోనే నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా కొనుగోళ్లు చేయగలిగిందన్నారు. మిగిలి ఉన్న ధాన్యాన్ని సైతం త్వరగా కొనుగోలు చేయడంలో మిల్లర్లు సహకరించాలని కోరారు. ఒక్కో మిల్లు సామర్థ్యానికి మించి ధాన్యాన్ని దిగుమతి చేసుకోక తప్పదన్నారు. సగటున ఒక్కో రైస్ మిల్లు యజమాని కెపాసిటీకి అదనంగా మరో 50 శాతం ధాన్యాన్ని తీసుకోవాలని సూచించారు.
మిల్లర్లకు ఎళ్ల్లవేళలా ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, మిల్లర్లు సహకరించి రైతులు నష్టపోకుండా చూడాలని ఆయన కోరారు. ఏ నియోజకవర్గ ధాన్యం అదే నియోజకవర్గంలోని మిల్లులకు దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ.. మిల్లర్లు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 150 శాతం కెపాసిటీ వరకు ధాన్యం దిగుమతి చేసుకోవాలని సూచించారు. వర్షం ప్రమాదం పొంచి ఉండడంతో వెంటవెంటనే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరారు. ఇందులో అందరి పాత్ర కీలకమని, సమన్వయంతో మరో పక్షం రోజులు పనిచేస్తే కొనుగోళ్లు పూర్తి అవుతాయన్నారు. మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా రైతు కోణంలో ఆలోచించి దిగుమతులు త్వరగా చేసుకోవాలని చెప్పారు.
వంద శాతం కంటే తక్కువ దించుకున్న మిల్లర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టనున్నట్లు అదనపు కలెక్టర్ హెచ్చరించారు. ధాన్యం లారీల నుంచి అన్లోడ్ చేసుకోవాలనారు. దిగుమతులు ఆలస్యమైతే ధాన్యం తరలింపునకు లారీలు లేక ఆటంకాలు ఏర్పడుతుందన్నారు. కాంట్రాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి అవసరమైన లారీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి చేద్దామని సుచించారు. ఈ సందర్భంగా జిల్లా రైస్ మిలర్స్ అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి మాట్లాడుతూ.. చివరి గింజ వరకు ధాన్యం దిగుమతి చేసుకుంటామని చెప్పారు. మిలర్లకు ఉన్న పలు సమస్యలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మిలర్ల సమస్యలను మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ నాగేశ్వర్రావు, తిప్పర్తి పీఏసీఎస్ చైర్మన్ పి.సంపత్‌రెడ్డి, నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్ యాదవ్, జిల్లా రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.