Parakala | పరకాల, జనవరి 8 : ‘మీరు ఎవరికోసం వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు.. ఒక కార్డు మెడలో వేసుకుంటే జర్నలిస్టులు అవుతారా.. మీరు మాట్లాడేది చాలా తప్పు’ అంటూ జర్నలిస్టులపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారంరేపాయి. కొద్ది రోజుల క్రితం హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్ వద్ద ఓ వృద్ధురాలు ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి మృతి చెందింది. దీంతో మున్సిపల్, పోలీసు, ఆర్టీసీ అధికారులు బస్టాండ్ చుట్టుపక్కల ఆక్రమణలను తొలగించి కంచె వేశారు. ఈ నిర్ణయంపై ప్రయాణికులు, వాహనదారులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తంచేశారు. గురువారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి బస్టాండ్ పరిసరాలను పరిశీలించి, కంచెను తొలగించాలని ఆదేశాలు జారీచేశారు. ఎమ్మెల్యే పర్యటనను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులు ప్రజల ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంచేశారు.
దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జర్నలిస్టులు ఐతే ఏంటి..? ఎవరికి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు అంటూ దురుసుగా వ్యవహరించారు. జర్నలిస్టులు ప్రశ్నించొద్దు, చెప్పింది రాసుకోవాలంటూ ఆదేశించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తూ అమరధామం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు అప్రజాస్వామికమని, ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై నోరు పారేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరికి వకాల్తా పుచ్చుకుని బస్టాండ్ ఆక్రమణల ఇనుప కంచె తొలగించారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రేవూరి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జనవరి8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సాగునీటి రంగం బలోపేతానికి ఇంజినీర్లు కృషి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సూచించారు. తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్ల సంఘం, తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని మంత్రి ఉత్తమ్ సచివాలయంలో గురువారం ఆవిషరించారు.

కార్యక్రమంలో ఇంజినీర్ల సంఘం గౌరవాధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, అధ్యక్షుడు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రకాశ్, వెంకట్‌నారాయణ, ఉషారాణి, మహేందర్నాథ్, ఏఈఈల అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, కార్యదర్శి నాగరాజు, కోశాధికారి సంతోష్, యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్షుడు మనోహర్, సుష్మ, జయశ్రీ, అరుణ తదితరులు పాల్గొన్నారు.