హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సాధారణ గ్రాంట్లు కాకుండా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి (స్పెషల్ డెవల్మెంట్ ఫండ్) నుంచి అదనంగా ప్రతి చిన్న గ్రామ పంచాయతీకి రూ.5 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు చొప్పున ఇస్తాం. కొత్త సంవత్సర కానుకగా ఈ నిధులు నేరుగా సర్పంచుల ఖాతాల్లో జమ అవుతాయి’ అని ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ‘నీటిపై రాత’లా చెరిగిపోయింది. గత నెల 24న తన సొంత నియోజకవర్గం కొడంగల్లో నిర్వహించిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్రెడ్డి ఈ హామీ ఇచ్చారు. దీంతో ఆ నిధులు వస్తాయని, తమ గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అత్యవసర పనులు చేసుకోచ్చని సంబురపడ్డ సర్పంచులకు నిరాశే ఎదురైంది. ప్రమాణం చేసి రెండు వారాలు అవుతున్నప్పటికీ తమ పంచాయతీల ఖాతాల్లో చిల్లిగవ్వ లేకపోవడంతో కొత్త సర్పంచులు ఏ పనీ చేయలేకపోతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోదా? అని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలోని గ్రామాలకు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.3,000 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉన్నది. గత రెండేండ్లుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించపోవడంతో కేంద్రం ఆ నిధులు విడుదల చేయలేదు. ఇటీవల రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఆ నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కానీ, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) నిధులు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) కూడా మంజూరు కాలేదు. చివరికి ముఖ్యమంత్రి ఇస్తానన్న నిధులు కూడా విడుదల కాకపోవడంతో జీపీల ఖాతాల్లో చిల్విగవ్వ లేదు. దీంతో ఏమిచేయాలో తెలియక కొత్త సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు.
కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో ఏవైనా అభివృద్ధి చేసి తమను తాము నిరూపించుకోవాలని తహతహలాడున్నారు. గ్రామ సభలు నిర్వహించాలని, గ్రామాల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చూస్తున్నారు. కానీ, జీపీ ఖాతాల్లో నిధుల్లేక నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం పారిశుద్ధ్య పనులు మాత్రమే చేయిస్తున్నారు. మాజీ సర్పంచులకు చెల్లించాల్సిన రూ.321 కోట్ల పెండింగ్ బిల్లులనే ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వకపోవడంతో అభివృద్ధి పనులకు సొంత డబ్బులు వెచ్చించేందుకు కొత్త సర్పంచులు వెనుకడుగు వేస్తున్నారు.