ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు పంటలపై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు యాదాద్రి జిల్లాకు వచ్చారు. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ పోగ్రామ్లో భాగంగా 35 మంది విద్యార్థినులు రాజాపేట, తుర్కపల్లి, ఆత్మకూరు, ఆలేరు, మోటకొండూరు మండలాల్లో రైతులను కలిసి సాగు వివరాలు తెలుసుకుంటున్నారు. వివిధ రకాల పంటలు, సాగు పద్ధతులపై అధ్యయనం చేస్తున్నారు.
– రాజాపేట, ఆగస్టు 3
రాజాపేట, ఆగస్టు 3 : రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల ఫైనలియర్ విద్యార్థులు మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. దాంతో పాటు వానకాలంలో సాగు చేసిన పంటల సమగ్ర సస్య రక్షణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 35 మంది విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవం కార్యక్రమంతో పాటు రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రొగ్రాంలో భాగంగా రాజాపేట, తుర్కపల్లి, ఆత్మకూరు, ఆలేరు, మోటకొండురూ మండలాల్లోని పలు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పంటలపై అధ్యయనం చేస్తూ రైతుల ద్వారా అనేక విషయయాలు తెలుసుకుంటున్నారు.
వ్యవసాయ కళాశాల విద్యార్థులు తాము పాఠ్యపుస్తకాల ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని రైతులకు అందిస్తూ వారిని చైతన్య పరుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందే పద్ధతులను వివరిస్తున్నారు. పంటలపై చీడపురుగులు, తెగుళ్లు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. పంటలకు అత్యంత ప్రమాదకరమైన వయ్యారిభామను ఆదిలోనే అంతంచేసే విధానాన్ని రైతులకు వివరిస్తున్నారు. వరి, పత్తి పంటలపై ఆశించే రసం పీల్చే పురుగుల నివారణ పద్ధతులు, వరి పంటకు నష్టం కలిగించే కాండం తొలుచు పురుగులులతో పాటు బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగుళ్ల నివారణ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. మండల వ్యవసాయ అధికారుల భాగస్వామ్యంతో రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రొగ్రాం ఆరు నెలల పాటు వివిధ మండలాల్లో కొనసాగనున్నట్లు విద్యార్థులు తెలిపారు.
గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవం కార్యక్రమంతో పాటు రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రొగ్రాంలో ఆలేరు నియోజకవర్గంలోని పలు మండలాలల్లో పంటలపై అధ్యయనం చేయడానికి వచ్చాం. మండల వ్యవసాయ అధికారులు, ఏరువాక శాస్త్రవేత్తల సహకారంతో నేర్చుకున్న అంశాలను రైతులకు వివరిస్తున్నాం. రైతులు సాగు చేసిన పంటను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటిలో ఉన్న లోపాలను గుర్తించి నివారణపై అవగాహన కల్పిస్తాం. పంటల సమగ్ర సస్యరక్షణ చర్యలపై రైతులకు సూచనలు ఇస్తాం.
-జి పావణి, వ్యవసాయ కళాశాల విద్యార్థి
మండల వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో రైతులు సాగు చేసిన పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆచరణాత్మక జ్ఞానం పొందుతున్నాం. మేము నేర్చుకున్న అంశాలను రైతులకు తెలుపుతూ పంటల సాగులో అవలబించాల్సిన కొత్త పద్ధతులను వివరిస్తున్నాం. ఆరు నేల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో మరిన్ని పంటలపై అధ్యయనం చేస్తాం.
-జి సాయిప్రియ, వ్యవసాయ కళాశాల విద్యార్థిని