సారంగాపూర్, మార్చి 15: సొంత స్థలాలు ఉన్న పేదలు పక్కా ఇండ్లు నిర్మించుకునేందుకు వీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకంలో భాగంగా వారు ఇంటి నిర్మాణం కోసం రూ.ఐదు లక్షలు పలు దశల్లో మంజూరు చేసేందుకు వీలు కల్పించింది. ఈ పథకం కింద మంజూరు పత్రాలు పొందిన పలువురు రెండున్నరేండ్ల క్రితమే పనులు ప్రారంభించారు. అప్పట్లో ఎన్నికల కోడ్ అమలు లోకి రావడంతో నిర్మాణ దశలో ఉన్న ఇండ్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఎలాగైనా బిల్లులు వస్తాయన్న నమ్మకంలో పలువురు లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం పూర్తిచేయగా.. డబ్బులు లేక కొందరు పనులు మధ్యలోనే నిలిపివేశారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ గృహలక్ష్మిని రద్దు చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్నది. తాము అప్పుచేసి ఇల్లు నిర్మించుకున్నామని, డబ్బులు రాకపోతే ఎలా అని ఆందోళన చెందుతున్నారు.
కొత్తపేట గ్రామానికి 40 ఇండ్లు మంజూరు కాగా ఇందులో 12 ఇండ్లు పూర్తయ్యాయి. మిగతా ఇండ్ల నిర్మాణం బెస్మింట్, లెంటల్, స్లాబ్దశలలో అసంపూర్తిగా మిగిలాయి. గృహలక్ష్మి లబ్ధిదారుల ఇబ్బందులను స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు,జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వారు ప్రభుత్వానికి వివరించడంతో సానుకూల స్పందన వచ్చింది. ఇందిరమ్మ స్కీం కింద గృహలక్ష్మి లబ్ధిదారులకు ఒక్కో ఇల్లు నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు ఇవ్వాలని ఏడాది క్రితం ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వివరాలు పంపించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. నిజామాబాద్ జిల్లాలో గృహలక్ష్మి పథకం ద్వారా 1,215 మంది లబ్ధిదారులు ఇండ్లు పూర్తిస్థాయిలో నిర్మించుకున్నారని ప్రభుత్వానికి సమర్పించారు.
కానీ కాంగ్రెస్ సర్కార్ ఇటీవల కొత్తగా విడుదల చేసిన జీవో96తో గృహలక్ష్మి లబ్ధిదారుల గుండెల్లో పిడుగు పడ్డట్లయ్యింది. బెస్మంట్ లెవల్ వరకు అసంపూర్తిగా ఉన్న ఇండ్లకు మాత్రమే జీవో నంబర్ 96లో అవకాశం ఇచ్చింది. ఇల్లు నిర్మాణానికి రూ.4లక్షలు వివిధ దశల వారీగా బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వం హౌసింగ్ అధికారులను జీవోలు ఆదేశాలు జారీచేసింది. దీంతో గృహాలక్ష్మీ కింద ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్న లెంటల్, స్లాబ్ నిర్మాణ దశల్లో ఉన్న వారికి బిల్లులు అందని ద్రాక్షగా మారే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో నేటి నుంచి నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు స్పందించి తమకు రావాల్సిన బిల్లుల విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గృహలక్ష్మి లబ్ధిదారులు కోరుతున్నారు.
భూమి అమ్మి స్లాబ్ లెవెల్ వరకు నిర్మించుకున్నాం..
పక్కా ఇల్లు మంజూరైందని ఇంటి పనులు ప్రారంభించాం. ఎలాగైనా బిల్లులు వస్తాయన్న ఆశతో మాకు ఉన్న 10 గుంటల భూమి అమ్మితే వచ్చిన రూ.5లక్షలతో పనులు ప్రారంభించాం. డబ్బులు సరిపోక ఫైనాన్స్‌లో రూ.ఆరు లక్షలు వడ్డీకి తెచ్చి స్లాబ్ వరకు పూర్తిచేశాం. ప్రస్తుతం డబ్బులు లేక బిల్లులు వస్తాయన్న ఆశతో ఉన్నాం. అధికారులు, నాయకులు మా బాధలు అర్థం చేసుకొని బిల్లులు వచ్చేట్లు చూడాలె.
-తుపాకుల మంజూల స్వామి, కొత్తపేట
బెస్మింట్ వరకు ఆగిన ఇండ్లకే రూ.4లక్షలు మంజూరు..
గతంలో మంజూరు చేసిన ఇండ్ల లబ్ధిదారుల్లో బెస్మింట్ లెవల్ వరకు కట్టుకొని ఆగిపోయిన వాటికి ప్రభుత్వం రూ.4లక్షలు మంజూరు చేస్తుం ది. ఇందు కోసం జీవో నంబర్ 96ను సర్కారు విడుదల చేసింది. గతంలో మంజూరైన ఇండ్ల నిర్మాణ పనులు లెంటల్, స్లాబ్‌లెవల్ పూర్తయితే బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఇప్పుడైతే బెస్మింట్ లెవల్ వరకు అసంపూర్తిగా నిలిచిన వాటికి మాత్రమే ఇందిరమ్మ పథకం ద్వారా బిల్లులు మంజూరు చేస్తున్నాం.
-గంగాధర్, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్, నిజామాబాద్