సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): బహిరంగ మార్కెట్లో హెచ్ఎండీఏ ఆస్తుల విలువ, వాటిని వినియోగంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన అధ్యయనం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఏడాది కిందటే ఓ ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించగా.. ఆరు నెలల వ్యవధిలోనే రిపోర్టు అందజేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఈ విషయంలో ఏ ఒక్కటి కూడా పూర్తికాలేదు. సంబంధిత ఏజెన్సీ ఇచ్చే నివేదిక ఆధారంగా హెచ్ఎండీఏ ఆస్తులను ఆర్థిక వనరులుగా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ నివేదికనుహెచ్ఎండీఏ పట్టించుకోవట్లేదనే విమర్శలున్నాయి. 11 జిల్లాల్లో విస్తరించిన హెచ్ఎండీఏ ప్రధానంగా కోర్‌సిటీలో విలువైన ఆస్తులను కలిగి ఉంది. కమర్షియల్ కాంప్లెక్సులు, ఖాళీ జాగాలు, పార్కులు, రిక్రియేషనల్ జోన్లతో హెచ్ఎండీఏకుఆదాయం సమకూరుతోంది. వీటిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, ఆస్తుల విలువను లెక్కించేందుకు ఈ ఏజెన్సీని నియమించింది.
లెక్క తేలితేనే వనరుల సమీకరణ..
ప్రభుత్వం గడిచిన రెండేళ్ల కాలంగా గుర్తించే స్థాయిలో ఏ ఒక్క ప్రాజెక్టును చేపట్టలేదు. కనీసం శంకుస్థాపన చేసిన రెండు ఎలివేటెడ్ కారిడార్ పనులను కూడా ఇప్పటివరకు పట్టాలెక్కించలేదు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం భూసేకరణతో కలిపి మొత్తం రూ.10వేల కోట్లు దాటుతుండగా… మరో రూ.10 వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. దీంతో భారీ స్థాయిలో నిధులు సమకూరితే తప్పా..ప్రాజెక్టులను మొదలుపెట్టే పరిస్థితి లేదు.
ఇప్పటికే ఎప్పుడో అందుబాటులోకి రావాల్సిన కొత్వాల్‌గూడ ఏకో పార్క్ నిధుల్లేక పనులు ఇంకా కొనసాగతూనే ఉన్నాయి. మరోవైపు మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం అంటూ హడావుడి చేసినా.. ఇప్పటికీ పనులే మొదలు కాలేదు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ఫోర్త్ సిటీ, రీజనల్ రింగు రోడ్డును అనుసంధానం చేస్తూ గ్రీన్‌ఫీల్డ్ హైవేలు అదనంగా సుమారు మరో రూ. 5వేల కోట్లు ఖర్చు చేస్తే గానీ ప్రాజెక్టు పూర్తిచేసే పరిస్థితి లేదు. దీంతో గొప్పగా చెప్పుకున్న ప్రాజెక్టులకు నిధులే ఆటంకంగా మారడంతో… అప్పుల బాటలో హెచ్ఎండీఏ అడుగులు వేయడం కాంగ్రెస్ పాలనలో మొదలుపెట్టింది. అయితే హెచ్ఎండీఏ వద్దనున్న ఆస్తుల లెక్క తేలితే గానీ ఆర్థిక వనరులను సమకూర్చుకునే వీల్లేకుండా పోయింది.