నల్లగొండ ప్రతినిధి, నవంబర్7(నమస్తే తెలంగాణ)/చండూరు/మర్రిగూడెం : ఓ వైపు ధాన్యం.. మరోవైపు పత్తి పంట దిగుబడి వచ్చే సమయమిది. ఈ టైమ్లో రైతులకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ సర్కారు నామమాత్రపు వ్యవహారంతో రైతులు మార్కెట్ మాయజాలానికి కుదేలు అవుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. పత్తి రైతులు సైతం బేజారవుతున్నారు. సర్కారు పట్టించుకోకపోవడంతో పండిన పంటను అడ్డికి పావుషేరుకు అమ్ముకుంటున్న దయనీయ పరిస్థితి. రైతులకు అండగా ఉండాల్సిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. దాంతో రైతులు దళారుల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్ మోసాలపై పత్తి రైతులు నిత్యం ఏదో ఒక చోట రోడ్డెక్కుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఈ సీజన్లో నల్లగొండ జిల్లాలో 5.45లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. 3.56 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఎన్నో ఆశలతో రైతులు సాగు చేసినా.. సకాలంలో వర్షాలు పడక కొంత, ఎడతెరిపి లేని ముసురు వల్ల మరికొంత పంట దెబ్బతింది. పత్తి దిగుబడిపైన తీవ్ర ప్రభావం పడింది. ఎకరాకు సగటున ఎనిమిది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందనుకున్నా, మూడు, నాలుగు క్వింటాళ్లకు మించి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పత్తిని సైతం అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోళ్లు జరిపి పత్తి రైతులకు అండగా నిలవాల్సి ఉండగా, అది జరుగడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి రైతులకు అండగా నిలిచి మద్దతు ధర అందేలా చూసింది.
కొన్నది 5,900 క్వింటాళ్లే…
నల్లగొండ జిల్లాలో మొత్తం 22 సీసీఐ కొనుగోలు కేంద్రాలను దశల వారీగా అందుబాటులోకి తెచ్చారు. వాటిల్లో నేటికీ చాలాచోట్ల పత్తి కొనుగోళ్లు సజావుగా సాగడం లేదు. అధికారుల లెక్కల ప్రకారం అన్ని కేంద్రాల్లో కలిపి కేవలం 5,900 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పటివరకు 30శాతం పత్తి మార్కెట్లోకి వచ్చినట్లు అంచనా. కాగా, మిగతాదంతా మధ్య దళారుల పాలైనట్లు రైతు సంఘాల నాయకులు చెప్తున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ప్రధానంగా తేమ శాతం పేరుతో రైతులు తెస్తున్న పత్తిని తిరస్కరిస్తున్నారు. 8 నుంచి 12శాతం తేమ ఉంటేనే కొంటామని సీసీఐ అధికారులు తెగేసి చెప్తున్నారు. కానీ వర్షాలతో పత్తి నాణ్యత దెబ్బతినడంతోపాటు తేమ శాతం కూడా అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో రెండు రోజులుగా పీఏపల్లి, మునుగోడు, మర్రిగూడ మండలాల్లోని కేంద్రాల వద్ద రైతులు ఆందోళనకు దిగుతున్నారు.
ఆలస్యంగా సీసీఐ కేంద్రాలు..
దసరా పండుగకు ముందు నుంచే రైతులు పత్తి ఏరడం మొదలుపెట్టారు. ఆ సమయంలో తీసిన పత్తి నాణ్యంగా ఉంది. తేమ శాతం కూడా ప్రభుత్వం ప్రకటించిన 8 నుంచి 12 శాతమే ఉంది. కానీ అప్పుడు ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తేలేదు. అప్రవూల్కు తీవ్ర జాప్యం చేయడంతో రైతులు నష్టపోయారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే రైతులకు ప్రభుత్వ మద్దతు ధర రూ.7,521 దక్కేది. కానీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు గ్రామాల్లో తిష్ఠ వేసిన దళారులకే విక్రయించక తప్పలేదు. అప్పటికే పంట పెట్టుబడికి తెచ్చిన అప్పు, కూళ్ల చెల్లింపులు వంటి అవసరాలు ఉండడంతో దళారులకు విక్రయించారు. దాంతో క్వింటాకు రూ.5,800 నుంచి రూ.6,200 వరకు మాత్రమే దళారులు ధర చెల్లించారు. దాంతో ఒక్కో కింటాకు సగటున పత్తి రైతులు రూ.1,500 నష్టపోయారు. రైతుల ఆందోళనల నేపధ్యంలో ప్రభుత్వం గత నెల 21 నుంచి సీసీఐ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తేవడం మొదలుపెట్టింది. అయినా నేటికీ వాటిల్లో కొనుగోళ్లు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి.
దళారుల సిండికేట్
ఇటీవల కురిసిన వర్షాలు పత్తి రైతును మరింత కుదేలు చేశాయి. పత్తి ఏరే దశలో కురిసిన వానలతో చేల మీదనే పత్తి నల్లపడడం, పత్తిలో తేమ బాగా ఉండడం వంటి జరిగాయి. ఆ పత్తిని రైతులు మార్కెట్కు తీసుకొస్తే సీసీఐ కొనుగోలు కేంద్రాలు పట్టించుకోవడం లేవు. దాంతో దళారులు ఆడిందే ఆటగా మారింది. ఇదే అదునుగా దళారులు గ్రామాల్లోకి వచ్చి కింటాకు రూ.5,400 నుంచి రూ.6,200 వరకు మాత్రమే చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. పైగా కింటాకు వివిధ రూపాల్లో ఏడెనిమిది కిలోల తరుగు తీస్తున్నారు. వీటన్నింటికీ తోడు దళారులు సిండికేట్గా మారి ధర పెంచకుండా రైతుల కష్టాన్ని మరింత దోచుకుంటున్నారు. ఇలా అన్ని విధాలుగా పత్తి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు వర్షాల భయంతోపాటు పత్తి తీసే అదును దాటిపోతుండడంతో పత్తి ఏరడానికి కూలీలు దొరుకడం లేదు. దీంతో రైతులు కిలో పత్తి తీసేందుకు రూ.14 నుంచి రూ.16వరకు చెల్లించాల్సి వస్తున్నది.
మద్దతు ధర కోసం రోడ్డెక్కిన పత్తి రైతులు
మాల్, నవంబర్ 7: సీసీఐ కేంద్రాల్లో పత్తికి మద్దతు ధర కల్పించాలని రైతులు నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై గురువారం రాస్తారోకో చేశారు. మండలంలోని నసర్లపల్లి, వెంకటంపేట కాటన్ మిల్లులో కొనసాగుతున్న సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర ఇవ్వడం లేదని నాలుగు గంటల పాటు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ జామ్ అవడంతో చింతపల్లి ఎస్ఐ బి.యాదయ్య వచ్చి రైతులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు.
అన్నీ ఇబ్బందులే
పత్తి చేనుకు పెట్టుబడి పెట్టి అప్పుల పాలైనం. ఈసారి రైతుభరోసా కూడా రాక పెట్టుబడులకు అప్పులు తెచ్చాం. పంట కూడా సరిగ్గా లేదు. ఏరిన పత్తిని అమ్ముకుందామంటే ధర లేదు. సీసీఐలో అమ్ముదామంటే 12 శాతం తేమ ఉండాలంటున్నరు. వర్షాలతో అంత వచ్చేలా లేదు. అప్పటిదాకా ఎదురుచూసే పరిస్థితి లేదు. సీసీఐలోనే ఆ పత్తిని ఎంతకో అంతకు కొన్నా బాగుండనిపిస్తున్నది. దళారులు క్వింటాకు 2వేలు తక్కువకు అడుగుతున్నరు. మ్యాచర్ రాని పత్తిని కూడా సీసీఐ కేంద్రాల్లోనే కొనుగోలు చేసి ఆదుకోవాలి.
పత్తి రైతులను నిలువునా ముంచుతున్నరు
ఎన్నో కష్టాలకోర్చి పత్తి పంట సాగు చేసిన. మధ్యమధ్యలో వర్షాలతో చేను బాగా దెబ్బతింది. అయినా సరే ఏరిన పత్తిని మార్కెట్లోకి తెస్తే ధర వస్తలేదు. ఇప్పటి వరకు 40 క్వింటాళ్లు సీసీఐకి అమ్మితే.. కింటాల్కు 3 నుంచి 4 కిలోల వరకు తరుగు తీస్తున్నరు. దళారులకు కాకుండా సీసీఐ కేంద్రానికి అమ్మినా ఫలితం లేకుండా పోయింది. ట్రాక్టర్ కిరాయి, ట్రాక్టర్లో పత్తి ఎత్తడానికి కూళ్లు అన్ని కలుపుకొని పెద్దగా మిగిలిందేమీ లేదు. అటు దళారులు, ఇటు సీసీఐ కేంద్రాల్లో పత్తి రైతులను నిలువునా ముంచుతున్నరు.
– కొండ రవి, తాస్కానిగూడెం, చండూరు మండలం