హాలియా. డిసెంబర్ 20 : పంచాయతీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కారు 100 స్పీడ్‌తో దూసుకెళ్తున్నది.. కాంగ్రెస్ పార్టీని తొక్కుకుంటూ పోతుంది.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ 20 ఏళ్ల వరకు అధికారంలోకి రాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం హాలియాలోని లక్ష్మీనర్సింహా గార్డెన్లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ సర్పంచ్, ఉప సర్పంచ్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంసీ కోటిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ నాయక్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్‌తో కలసి జగదీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ అన్నింటా విఫలమైందన్నారు. అందుకు సర్పంచ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చి ఉండొచ్చని, కానీ ఓట్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్ల కాలంలో సమర్థవంతమైన పాలన అందించి ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో గూండాయిజం, రౌడీయిజానికి ఎందుకు పాల్పడాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా ఎందుకు అడ్డుకున్నారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఎందుకు బెదిరింపులకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పక్షాన గెలుపొందిన సర్పంచ్‌లను కాంగ్రెస్ నాయకులు తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ మీరెంత ఖర్చుపెడితే అంత ఇస్తాం అంటూ బేరసారాలు కొనసాగించడం సిగ్గుచేటన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలే స్వయంగా గ్రామాలకు వెళ్లి డబ్బులు పంపణీ చేయడంతో పాటు, బీఆర్ఎస్ నాయకులను బెదిరించమని పోలీసులకు హుకుం జారీచేయడం, పోలింగ్ అధికారుకు ఫోన్‌చేసి భయపెట్టడం వంటి చర్యలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ నాయకులు ఇన్ని చేసినా బీఆర్ఎస్కే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 40 శాతం ఓట్లు రాబట్టగలిగామన్నారు. గులాబీ కండువా వేసుకొని కేసీఆర్ పేరు చెబితేనే ఇన్ని ఓట్లు వస్తే.. రేపు కారు గుర్తుపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోతే ఎట్లుంటదో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారి ఊహించుకోవాలన్నారు. ఇప్పుడు జరిగిన సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగినవి కావు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కారు గుర్తు వస్తది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ తొక్కుకుంటు పోతదని అన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పరిపాలనను గాలికొదిలి కమీషన్ల కోసం పని చేస్తున్నారని దుయ్యబట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడ్డారని జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే నల్లగొండ జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందినదని జగదీశ్ రెడ్డి అన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ జిల్లా నాయకులు కుందూరు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సాధించలేని అభివృద్ధిని బీఆర్ఎస్ పదేళ్లకాలంలో సాధించిందని తెలిపారు. కేసీఆర్ పాలనలో జిల్లాకు యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌ను తీసుకురావడంతో పాటు మూడు మెడికల్ కాలేజీలు, 3 సూపర్ స్పెషాలిటీ దవాఖానలను తీసుకొచ్చామన్నారు. పేద విద్యార్థులు చదువుకునేందుకు గురుకుల పాఠశాలలు, రెసిడెన్సియల్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. బీడు భూములకు సాగునీరందించామన్నారు. సాగర్ ఎడమ కాల్వ రాజవరం మేజర్ కాల్వ చివరి భూములకు సాగునీరందించిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. జిల్లా నుంచి ఫ్లోరిన్ భూతాన్ని తరిమికొట్టడంతో పాటు కాంగ్రెస్ పాలనలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామని గుర్తు చేశారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. రెండేళ్లలో తీసుకొచ్చిన కొత్త ప్రాజెక్టు ఒక్కటీ కూడా లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకే ప్రారంభోత్సవాలు చేస్తూ తిరుగుతున్రు.. తప్ప కొత్తగా చేసిందేమీ లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కొట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెస్తే బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులను కూడా పూర్తి చేయించే సోయి ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేకపోవడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఉంటే నెల్లికల్లు లిఫ్ట్ ఎప్పుడో పూర్తయ్యేదని భగత్ పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ కంటే గొప్ప పాలన అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా సక్రమంగా ఇవ్వలేదు. ఇప్పటికి 3 కార్ల రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు.. అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తోందని, రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జనం కారు గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు.

నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, గ్రామ, మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో హాలియాకు తరలివచ్చారు. హాలియాలోని రామాలయం నుంచి లక్ష్మీనర్సింహా గార్డెన్ వరకు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ నాయకత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో హాలియా జనసంద్రంగా మారింది.
ర్యాలీ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, రవి నాయక్, సత్యపాల్, నాగులవంచ తిరుపతిరావు, పామోజు వెంకటాచారి, బొల్లం జయమ్మ, చెన్ను సుందర్‌రెడ్డి, కూరాకుల అంతయ్య,యడవల్లి మహేందర్‌రెడ్డి, ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, గజ్జల శ్రీనివాసరెడ్డి, అనుముల శ్రీనివాసరెడ్డి, వడ్డే సతీష్‌రెడ్డి, నల్లగొండ సుధాకర్, భిక్షానాయక్, పొదిల శ్రీను, బొల్లం సైదులు, రాంఅంజయ్య, తదితరులు పాల్గొన్నారు.