కట్టంగూర్, నవంబర్ 3 : ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. కట్టంగూర్ మండలం అయిటిపాములలో ఆదివారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. పండించిన పంటలను కొనుగోలు చేయలేని దిక్కుమాలిన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లాలో ప్రతి సంవత్సరం దాదాపు 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 60 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదని తెలిపారు.
గత సంవత్సరం ఇదే సీజన్లో కేసీఆర్ ప్రభుత్వం 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 9వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రం కొనుగోలు చేయడం సిగ్గుచేటన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు, మిల్లర్లను సమన్వయం చేయడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలం చెందారని అన్నారు. పది నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రణాళిక లేకుండా ఆర్భాటంగా ధాన్యం కేంద్రాలను ప్రారంభించి మళ్లీ తిరిగి చూసే పరిస్థితులు లేవన్నారు.
ధాన్యం కొనుగోళ్లు జరుగకపోవడంతో రైతులు తక్కువ ధరకు ప్రైవేట్లో అమ్మి నష్టపోవాల్సి వస్తున్నదని చెప్పారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం భేషరతుగా వెంటనే కొనుగోలు చేసి, బోనస్ రూ.500వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు బెల్లి మహాలక్ష్మీసుధాకర్, నలమాద వీరమ్మ సైదులు, మాజీ సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి. మల్లెబోయిన శ్రీలతకృష్ణ, నరేందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.