చేనేత కార్మికులను రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు అర చేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్.. ఇప్పుడు మొండి చెయ్యి చూపిస్తున్నది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు పూర్తి కావడంతో నేతన్నలను గాలికొదిలేసింది. అంతటితో ఆగకుండా ఉన్న పథకాలను ఊడబీకుతున్నది. బీఆర్ఎస్ హయంలో సమర్థంగా అమలైన స్కీమ్లను అటకెక్కిస్తున్నది. పైగా..కొత్త పథకాలను ప్రకటించకుండా, అమలు చేయకుండా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నది.
– యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ)
యాదాద్రి జిల్లాలో సుమారు 11 వేల మంది నేత కార్మికులు ఉంటారు. వీరంతా రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. నెలంతా పనిచేసినా పూటగడవడమే గగనం. అలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసింది. వలసలు వెళ్లిన కార్మికులు కూడా తిరిగి వెనక్కి వచ్చారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీన్ మారింది. నేతన్నలను బతుకు దినదిన గండంగా మారుతున్నది.
చేనేత పథకాలను అన్నీ కొనసాగిస్తామని ఎన్నికల్లో ప్రకటించినా.. ఇప్పుడు మాత్రం ఉన్న పథకాలకు హస్తం సర్కారు పాతరేస్తున్నది. మరోవైపు టెస్కో చేనేత వస్ర్తాల కొనుగోళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. చేనేత పట్టు చీరల నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతున్నాయి. ఎప్పటికప్పుడు కొనాల్సిన టెస్కో కనీసం పట్టించుకోవడంలేదు. వస్త్ర నిల్వలు రూ. కోట్లల్లో పేరుకుపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు.
నేత కార్మికుల సామాజిక భద్రత కోసం తీసుకొచ్చిన పొదుపు పథకం అమలుపై ప్రతిష్టంభన నెలకొంది. ఆగస్టుతో పథకం గడువు ముగిసింది. అయితే మళ్లీ పథకం కొనసాగించాలా..? వద్దా..? అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అధికారులు మాత్రం తమకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని చెబుతున్నారు. ఇటీవల ఐఐహెచ్టీ ప్రారంభోత్సవ సభలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నేతన్నల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది.
ఈ పథకం కింద ఇప్పటి వరకు నేత కార్మికుల నెలసరి చేనేత ఆదాయంలో ఎనిమిది శాతం ఆర్డీ 1లో జమచేసిన తర్వాత.. ప్రభుత్వం ఆర్డీ 2లో 15శాతాన్ని నేరుగా జమ చేయాలి. ఆ మొత్తం నగదును వడ్డీతో సహా మూడేండ్ల తర్వాత కార్మికులకు అందుతుంది. ప్రస్తుత 2021-2024 సంవత్సరానికి గానూ ఇటీవల పూర్తి కావడంతో కొత్తగా మళ్లీ ప్రారంభించాల్సి ఉంది.