నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ మాటలు నీటి మూటలయ్యాయి. 42 శాతం రిజర్వేషన్ల మాట దేవుడెరుగు. గతంతో బీఆర్ఎస్ సర్కార్ బీసీలకు ఇచ్చిన 23 శాతం రిజర్వేషన్లకే దిక్కులేదు. తాజా గా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన రిజర్వేషన్ల తీరును పరిశీలిస్తే బీసీ రిజర్వు సర్పంచ్ స్థానాలు భారీగా తగ్గాయి. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీఆర్ఎస్ సర్కార్ ప్రకటిస్తే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అడ్డుపడింది. తాము అధికారంలోకి వస్తే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. తీరా అధికారంలో వచ్చాక 42శాతం పేరుతో రెండేళ్లుగా నానబెట్టి చివరకు అసలుకే ఎసరు తెస్తూ బీసీ కోటాలో భారీ కోత పెట్టింది.
బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్లు ఖరారు చేయగా రాష్ట్ర స్థాయిలో బీసీల కోటా 17.08 శాతానికే పరిమితమైంది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే గణాంకాలు మరీ దారుణంగా ఉన్నాయి. దీంతో బీసీ వర్గాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. నమ్మించి గోతు కోసిన చందంగా ప్రభుత్వ వ్యవహరిస్తోందంటూ మండిపడుతూ పలుచోట్ల ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఇన్నాళ్లూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అంటూ మభ్యపెట్టిన కాంగ్రెస్ సర్కా ర్ ఇప్పుడు అందులో సగానికి కూడా దిక్కులేకుండా చేసింది.
నల్లగొండ జిల్లాలో 869 గ్రామ పంచాయతీలకు ఉండగా అందులో 139 స్థానాలనే బీసీలకు పరిమితం చేశారు. ఇది మొత్తం గ్రామ పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ల శాతం 15.995 శాతానికే పరిమితం. వాస్తవంగా వీరి శాతం 23 శాతం వరకు ఉండొచ్చు. ఇక గత 2019 ఎన్నికలతో పోల్చినా కూడా బీసీ స్థానాలు తగ్గాయి. గత ఎన్నికల్లో 844 గ్రామ పంచాయతీలు ఉండగా అప్పుడు 165 స్థానాలు బీసీలకు కేటాయించగా బీసీ రిజర్వేషన్లు 22.30 శాతం బీసీలకు సర్పంచ్ స్థానాలు దక్కాయి. అప్పటితో పోలిస్తే ఈ సారి నల్లగొండలో గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగినా బీసీ కోటా అంతకంతకూ తగ్గింది. సూ ర్యాపేట జిల్లాలో మరీ దారుణంగా బీసీ రిజర్వు గ్రామ పంచాయతీల సంఖ్య పడిపోయింది. మొత్తం 486 పం చాయతీలకు 66 పంచాయతీలనే బీసీలకు కేటాయించారు.
ఇది మొత్తం పంచాయతీల్లో 13.580 శాతమే. 42 శాతమేమో కానీ ప్రస్తుత కోటా ప్రకారం దక్కాల్సిన 23శాతం కూడా దక్కకుండా పోయింది. ఇక ఎస్సీ స్థానా ల కంటే కూడా బీసీ రిజర్వు స్థానాల సంఖ్య గణనీయం గా తగ్గిపోయాయి. యాదాద్రి జిల్లాలో మాత్రం బీసీ కోటా కొంత మెరుగ్గా ఉంది. ఇక్కడ కూడా గత ఎన్నికలతో పోలిస్తే కొన్ని బీసీ రిజర్వు స్థానాలు తగ్గాయి. ఇక్కడ 427 పంచాయతీలు ఉండగా 105 పంచాయతీలు బీసీలకు రిజర్వ్ చేశారు. ఇది మొత్తంలో 24.590 శాతం. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే అప్పుడు 421 పంచాయతీలు ఉండగా 108 సర్పంచ్ స్థానాలు రిజర్వు కాగా ఇప్పుడు మూడు తగ్గాయి. గతంతో పోలిస్తే గ్రామ పంచాయతీల సంఖ్య 6కు పెరిగినా ఈసారి బీసీ స్థానాలు 3 తగ్గ డం గమనార్హం. వార్డు సభ్యుల స్థానాల్లోనూ బీసీ కోటా భారీగా తగ్గినట్లు బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
కోటా పేరుతో కోతలు..!
బీసీ సంఘాల ఆగ్రహం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ కపట నాటకంపై బీసీ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. రిజర్వేషన్లు ప్రకటించిన నాటి నుంచి ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల నిత్యం ఆందోళనలు కొనసాగుతున్నాయి. నల్లగొండలో బీసీ సం ఘా ల జేఏసీ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల పత్రాలను చించివేసి నిరసన వ్యక్తం చేశారు. అనేక చోట్ల ప్రభుత్వ ద్రోహంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు రూపాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై బీసీ సంఘాల నేతలు, ప్రముఖులు, మేధావులు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణ మే ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.