యాదాద్రి భువనగిరి, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సమయంలో గంపెడు హామీలు ప్రకటించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నేటికీ నెరవేర్చకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. కనీసం చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులకు సైతం నిధులు కేటాయించకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే తుర్కపల్లిలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
తుర్కపల్లిలో పారిశ్రామికవాడ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి సహకారంతో గత ప్రభుత్వం నిర్ణయించగా.. తుర్కపల్లిలోని సర్వే నంబర్ 72లో పార్కు ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పట్టించుకోకపోవడంతో పార్కు పనులు ముందుకు కదలడం లేదు.
ఆలేరు రెవెన్యూ డిజిజన్ కల కలగానే మారింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో డివిజన్ చేస్తామని అమలుకు నోచుకోలేదు. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తున్నా ఊసేలేదు. ఆలేరులో డివిజన్ ఏర్పాటైతే సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది.
చేనేత కార్మికులకు మేలు చేసే భూదాన్ పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు ప్రారంభానికి అడుగులు పడటంలేదు. గత ప్రభుత్వం నేత కార్మికుల కోసం 12.5 కోట్లకు కొనుగోలు చేసి పునరుద్ధరించాలని సంకల్పించిన లక్ష్యం నెరవేరడంలేదు. ఈ పార్కు అందుబాటులోకి వస్తే నేతన్నలకు ఉపాధి లభించనుంది.
అధికారంలోకి వస్తే ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మారుస్తామని చెప్పిన కాంగ్రెస్.. తీరా అధికారంలోకి వచ్చాక మొండి చెయ్యి చూపించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం హామీ ఇచ్చినా నెరవేరడం లేదు. కాగా, అలైన్మెంట్ కోసం మాత్రం రైతులు కోర్టుల చుట్ట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.
భువనగిరిలో చేపట్టిన బస్వాపూర్ రిజర్వాయర్ ప్రారంభానికి నోచుకోవడంలేదు. బీఆర్ఎస్ హయాంలో 90శాతం పనులు పూర్తయినా అడుగు ముందుకు కదలడంలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం బాధితులకు పరిహారంతో పాటు మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు.
బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వలు కాగితాలకే పరిమితమయ్యాయి. కాల్వల పునరుద్ధరణలో భాగంగా పిల్లాయిపల్లికి రూ.86 కోట్లు, ధర్మారెడ్డి పల్లికి రూ.124 కోట్లు, బునాదిగాని కాల్వకు రూ.269 కోట్లు కేటాయించారు. కానీ భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో టెండర్ల దశలోనే పనులు కొనసాగుతున్నాయి.
రాయగిరిలో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు పత్తాలేకుండా పోయింది. 2023లో 10ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఇప్పటి వరకు స్టేడియమే మంజూరు కాలేదు.
మదర్ డెయిరీ ప్రధాన కార్యాలయం హయత్ నగర్లో ఉన్నప్పటికీ అధిక శాతం పాల సేకరణ యాదాద్రి జిల్లా నుంచే వెళ్తుంది. గతంలో ఎప్పటికప్పుడు బిల్లులు సకాలంలో చెల్లించేవారు. కానీ ప్రస్తుతం నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
గత ప్రభుత్వంలో ఆలయ పునర్నిర్మాణం చేపట్టగా 90శాతం పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టెంపుల్ సిటీపై కాటేజీలు, ఫ్లైఓవర్, గండిచెరువు సుందరీకరణ, పెద్ద గుట్ట నుంచి కొండపైకి రోప్‌వే, కల్యాణ కట్ట వద్ద సీఆర్, రాయగిరి నుంచి కొండపై వరకు ఇజ్రాయెల్ టెక్నాలజీ సౌండ్ సిస్టం పనులు నిలిచిపోయాయి.
రాజాపేట బ్రాంచ్ కెనాల్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదు. గతంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి హయాంలో బ్రాచ్ కెనాల్ కాల్వ తవ్వకాల కోసం మండలంలో 157 ఎకరాల భూమిని సేకరించారు. కానీ ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.