రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికొదిలేసింది. నిరుపేదలు చదివే సర్కారు పాఠశాలలను పట్టించుకోవడమే మానేసింది. కనీసం సదుపాయాలు లేకపోవడంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు నత్తనడకన సాగుతున్నాయి. పిల్లలున్నా టీచర్లు లేకపోవడంతో నాణ్యమైన విద్య దొరుకడంలేదు. ఇక మన ఊరు-మన బడి పథకాన్ని అటకెక్కించారు. మధ్యాహ్న భోజనం బిల్లులు సకాలంలో రావడం లేదు.
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు అంతంతే..
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీని కింద టాయిలెట్లు, తాగునీరు, మైనర్, మేజర్, మరమ్మతులు, విద్యుత్ తదితర పనులు చేపట్టాలి. కానీ జిల్లాలో పనులు ముందుకు సాగడంలేదు. పాఠశాలు పునఃప్రారంభం నాటికే పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ పనులు మెల్లగా నడుస్తున్నాయి. 50శాతం పనులకే నిధులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అనేక చోట్ల పాత భవనాల్లోనే పాఠశాలలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల భనవాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
బిల్లులు కట్టకపోవడంతో కరెంట్ కట్
మరో వైపు పాఠశాలలకు ఉచిత విద్యుత్ కరెంట్ లేకపోవడంతో బిల్లు చెల్లించని స్థితిలో పాఠశాలలు ఉన్నాయి. దాంతో విద్యుత్ కట్ చేస్తుండటంతో అంధకారంలో పాఠశాలలుంటున్నాయి. మరో వైపు ఆన్లైన్ డిజిటల్ తరగతులు ప్రసారం చూడలేని స్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో నియోజకవర్గానికి ఒక్క పాఠశాల చొప్పున సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం షురూ చేయగా అది కొన్ని పాఠశాలల్లో కొనసాగుతున్నది. కానీ మెనూ పాటించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క జత యూనిఫామ్ పంపిణీ..
జిల్లాలో విద్యార్థులకు రెండు జతలకు బదులు ప్రభుత్వం ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చింది. ఇంకా ఒక జత బట్టలు రావాల్సి ఉంది. జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, కేజీబీవీ, ఆదర్శ, అర్బన్ రెసిడెన్షియల్, గురుకుల రెసిడెన్షియల్, ట్రైబల్ రెసిడెన్షియల్, ఎయిడెడ్ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని కుట్టేందుకు స్వయంసహాయక సంఘాలకు అందించారు.
ఇంకా రెండో జత కుట్టే ప్రక్రియలోనే ఉన్నా యి. మరోవైపు మధ్యాహ్న భోజన బిల్లులు రెండు నెలలుగా అందడంలేదు. వారికి నెలవారీగా ఇచ్చే రూ.3వేల గౌరవ వేతనం కూడా ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్నది. మధ్యా హ్న భోజన సరుకులకు పెట్టుబడి తెచ్చి పెట్టడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించాలని కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
పిల్లలు సరే.. టీచర్లేరి..?
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల కొరత వేధిస్తున్నది. 12 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉండాలి. 24కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. కానీ చాలా స్కూళ్లలో సరిగ్గా టీచర్లు లేరు. అనేక పాఠశాలలు ఒక్కరు, ఇద్దరు ఉపాధ్యాయులతోనే నడుస్తున్నాయి. దాంతో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి చదువు చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి.
ఇక హైస్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లు లేరు. కొన్ని చోట్ల ఇంకా పోస్టింగులు ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల నాణ్యమైన విద్య అందడంలేదు. ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని గొప్పలు చెప్పినా ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. ఉపాధ్యాయులు వచ్చే వరకు విద్యా వలంటీర్ల నియామకానికి ఇప్పటివరకు చర్యలు లేవు. దీంతో పలు పాఠశాలల్లో విద్యార్థులు చదువులు వెనుకబడే అవకాశం ఉన్నది. ఇక స్కూళ్లలో స్కావెంజర్లు లేరు. గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నా ఇష్టం ఉన్నప్పుడు వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టెక్స్ బుక్స్ కూడా చాలా పాఠశాలల్లో పూర్తి స్థాయిలో రాలేదు. రెండో విడుత రావాల్సి ఉన్నది.
మన ఊరు-మన బడి బంద్
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మరమ్మతులు, కొత్త నిర్మాణాలకు నిధులు విడుదల చేసి పనులు చేపట్టింది. వీటిల్లో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మన ఊరు-మన బడి పథకాన్ని అటకెక్కించింది. దీంతో పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అంతే కాకుండా చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలేదు. దాంతో వారంతా అధికారుల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఉద్యోగాలు ఇవ్వరు.. వలంటీర్లను నియమించరు
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక చాలా మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపేందుకు ఇష్టపడడం లేదు. గతంలో విద్యా వలంటీర్ల ద్వారా గ్రామాల్లోని నిరుద్యోగుకు ఉద్యోగ అవకాశాలు కల్పించేవారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశంగా చర్యలు తీసుకోక పోవడంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. గతంలో పని చేసిన వలంటీర్లు ఇతర పనులకు పోయే పరిస్థితి లేకుండా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యా వలంటీర్ల వ్యవస్థలను పునరుద్ధరించాలి.
– యలమద్ది అశోక్‌కుమార్, నిరుద్యోగి, సూర్యాపేట
పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. ఏడు నెలలుగా గౌరవ వేతనం అందడం లేదు. అప్పులు చేసి సరుకులను తేవాల్సి వస్తున్నది. నిత్యావసర బిల్లులు గత ఫిబ్రవరి నుంచి మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు వెంటనే బిల్లులు ప్రభుత్వానికి పంపి నిధులు విడుదలయ్యేలా చూడాలి. లేకుంటే మధ్యాహ్న భోజన కార్మికులందరితో ఉద్యమం తీవ్రతరం చేస్తాం.
-వట్టెపు సైదులు, మధ్యాహ్న భోజన కార్మిక సంఘ మండల గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ, మేళ్లచెర్వు
స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం విచారకరం
విద్యా సంవత్సరం ముగిసినా స్కాలర్షిప్లు ఇంకా విడుదల కాలేదు. పేద, మధ్య తరగతి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు దోహదపడే స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల వేయాలి. ఇప్పటికే రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమవ్వగా తల్లిదండ్రులకు ఫీజులు భారంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పింది. స్కాలర్షిప్లను చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలి.
-గుగులోతు శ్రీనివాస్‌నాయక్, అనంతగిరి
మధ్యాహ్నం భోజనం బిల్లు అందజేయాలి
బడిలో పిల్లలకు మధ్యాహ్నం భోజనంలో అవసరమైన కూరగాయలు, నిత్యావర సరుకులు మేమే కొనుగోలు చేస్తున్నాం. బిల్లులు నెలనెలా అందకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తున్నది. మాకు ప్రతి నెలా అందజేసే హెల్పర్ గౌరవ వేతనాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇస్తే మాకు ఇబ్బందులు ఉండవు.
– కారింగ్ లక్ష్మమ్మ, ఎంపీపీఎస్ రేగట్టె, కనగల్ మండలం
అందరికీ అందజేశాం
జిల్లా విద్యాశాఖ నుంచి వచ్చిన 1 నుంచి 8వ తరగతి కుకింగ్ కాస్ట్ ఏప్రిల్ 2024 వరకు, కోడి గుడ్ల కాస్ట్ మార్చి 2024 వరకు అందచేశాం. గౌరవేతనం రూ.1,000 ఏప్రిల్ 2024 వరకు, రూ.2000 మార్చి 2024వరకు విడుదల చేశాం. కొంత మందికి డీటీఓ నుంచి అందాల్సినవి జమ కాలేదని తెలిసింది. తర్వలోనే అందుతాయి. జూన్ బిల్లు ప్రపోజల్స్ అందచేశాం.
– అరుందతి, ఎంఈవో – నల్లగొండ