కేతేపల్లి, అక్టోబర్ 3 : ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రూ.2లక్షల రుణమాఫీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ చేయకపోవడాన్ని నిరసిస్తూ కేతేపల్లి మండల కేంద్రంలో పలు గ్రామాల రైతులతో కలిసి గురువారం ఆయన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయం ముందు రైతుధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ రుణమాఫీ కాకపోవడంతో అనేక మంది రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎంత మంది రైతులకు, ఎంత రుణం మాఫీ చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దసరా పండుగలోపు రైతులందరికీ షరతుల్లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జూన్ నెలలో ఇవ్వాల్సిన రైతుభరోసా ఇంత వరకు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నారు.
రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌రెడ్డి నోటి దురుసుతో ప్రజలు విసుగు చెందుతున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి అన్నారు. ఎన్నికల హామీల అమలును పక్కదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ నాయకులపై దాడులు, విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎంను అనుసరిస్తూ మంత్రులు అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలనపై అవగాహన లేని రేవంత్‌రెడ్డి సీఎం అవడం ప్రజల దురదృష్టమన్నారు. హామీల అమలులో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.
ప్రజలకు సమర్ధవంతమైన పాలన అందించాల్సిన పాలకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ధర్నాలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్‌రెడ్డి, చిముట వెంకన్నయాదవ్, నాయకులు బి.శ్రీనివాస్‌యాదవ్, కె.ప్రదీప్‌రెడ్డి, బంటు మహేందర్, ఆర్.శ్రీనివాస్‌గౌడ్, బి.సురేశ్, కె.శ్రవణ్, జి.సత్యనారాయణగౌడ్, వి.చేతన్ పాల్గొన్నారు.