మునుగోడు, ఆగస్టు 01 : కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని సీపీఐ మునుగోడు మండల కార్యదర్శి చాపల శ్రీను అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం బెల్లం శివయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చాపల శ్రీను ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 44 కార్మిక చట్టాలను అపహాస్యం చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం అన్ని రకాల ఆదుకోవాలన్నారు.
కార్మికులు ప్రమాదాలకు గురైతే సంక్షేమ బోర్డు ద్వారా ప్రమాద బీమా తక్షణమే చెల్లించాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు వృద్ధాప్య పెన్షన్ రూ.5 వేలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన కార్మికులకు ఇవ్వాలన్నారు. నానా షరతులు పెట్టి పేదలకు సొంతింటి కలను దూరం చేయొద్దన్నారు. ఈ కార్యక్రమంలో పందుల చిన్న నరసింహ, బొల్లు సైదులు, ఏర్పుల నరసింహ, గోలి హుస్సేన్, మాల్యాద్రి, బి.శ్రీను పాల్గొన్నారు.