వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడనుంది. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ నెల 27 సాయంత్రం 4గంటలకు పోలింగ్ ముగియనుండడంతో నేటి సాయంత్రం 4 గంటల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగబోనున్నది. ఆ తర్వాత ఓటర్లను మచ్చిక చేసుకునే క్రమంలో అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీతోపాటు సంఘాలు బలపర్చిన అభ్యర్థులు మంగళవారం సాయంత్రం నుంచి పోలింగ్ రోజు వరకు ఓటర్లకు మరింత దగ్గర అయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు చర్చ సాగుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బహుముఖ పోటీ నెలకొనడంతో గెలుపు కోసం చివరి క్షణం వరకు ఏవరు ఏం ఎత్తుగడలు వేస్తారోనన్నది ఆసక్తికరంగా మారింది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతోపాటు ప్రధాన అభ్యర్థుల సంఖ్య కూడా పెరుగడ పాటు ప్రచారం కూడా హోరెత్తుతున్నది. మొత్తం ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. ఇందులో ప్రధాన పార్టీ, సంఘాల అభ్యర్థులు ఓటర్ల నమోదు నుంచే రంగంలోకి దిగగా కొందరు మాత్రం నామినేషన్ల అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజకవర్గం విస్తృతి చాలా పెద్దది అవడంతో ముందు నుంచే ప్రధాన సంఘాల అభ్యర్థులు అన్ని మండలాలను కవర్ చేయాలన్న ప్లాన్‌తో ప్రచారం నిర్వహించారు. పది రోజులుగా క్షేత్రస్థాయి ప్రచారంతోపాటు సోషల్ మీడియాలో సైతం ప్రచారాన్ని విపరీతంగా నిర్వహిస్తున్నారు. అధ్యాపకులు, ఉపాధ్యాయుల సమస్యలు, వాటికి పరిష్కారాలు, ఇప్పటివరకు తమ సంఘాల ఆధ్వర్యంలో సాధించిన ఫలితాలు, రానున్న కాలంలో తాము కేంద్రీకరించే అంశాలు తదితర అంశాలే ప్రచారంలో ప్రధాన అస్ర్తాలుగా నిలిచాయి. ఈ క్రమంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరుపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ ఎన్నికల్లో 12 జిల్లాల పరిధిలోని 25,797మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటర్లుగా ఉన్నారు.
ప్రధాన సంఘాల మధ్యే పోటీ
ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు ఈ ఎన్నికలను తొలి నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బరిలో మొత్తం 19 మంది అభ్యర్థులు ఉన్నా… ఐదారుగురు ప్రధాన అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొందన్న అభిప్రాయాలున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ, టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తంరెడ్డి, బీసీ సంఘాల నుంచి టీచర్స్ జాక్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీసీసీ అధికార ప్రతినిధి, మాజీ పీఆర్టీయూ నేత గాలిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి ప్రధాన సంఘాల నుంచి బరిలో నిలిచారు. దాంతో ఆయా సంఘాల బలాబలాలు, సామాజిక అంశాల ఆధారంగా వారంతా గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రతి ఓటరునూ కలిసేలా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగారు. అందరూ నియోజకవర్గం పరిధిలోని ప్రతి మండలంలో ప్రచారం నిర్వహించేలా జాగ్రత్త పడ్డారు. అభ్యర్థులు స్వయంగా ప్రచారం చేయడంతోపాటు ఆయా సంఘాల బాధ్యులు కూడా మండలాల వారీగా ఓటర్లను పంచుకుని రోఊ టచ్‌లో ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే ప్రధాన అభ్యర్థులంతా తమ బలాబలాలపై ఓ అంచనాకు వచ్చి గెలుపునకు అవసరమైన ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా చివరి ప్రధాన అస్త్రాలుగా ప్రలోభాలకు సైతం తెరపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం 4 గంటలకు అధికారికంగా ప్రచారం ముగియనుండడంతో తర్వాత ఓటర్లను కచ్చితంగా తమ వైపు తిప్పుకొనేందుకు కావాల్సిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతున్నంది.
4గంటల తర్వాత నో చాన్స్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. ఈ నెల 27న పోలింగ్ జరుగనున్న నేపధ్యంలో నేటి నుంచి సైలెన్స్ పీరియడ్ అమల్లోకి రానుంది. సాయంత్రం 4 గంటల నుంచి బహిరంగ సభలు, ర్యాలీ లు, సమావేశాల ద్వారా ప్రచారం నిషేధం. అభ్యంతకర, రాజకీయపర అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్ ఎస్ఎంఎస్ పంపడంపైనా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల నిబంధనల ప్రకారం నియోజకవర్గవ్యాప్తంగా 144సెక్షన్ కూడా అమలులోకి రానుంది. ఈ 48 గంటలపాటు ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాలో మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. రెండు రోజుల్లో సాధారణ మ ద్యం షాపులతోపాటు ఇతర రకాల మద్యం అమ్మకాలకు లైసెన్స్ పొందిన వారు కూడా అమ్మకాలు చేయడం లేదా సర్వ్ చేయడంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951, ఎన్నికల నియమావళి 1961 ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నల్లగొండ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఈ 48 గంటల సమయంలో ఇతర జిల్లాలకు చెందిన వారు జిల్లాలో ఉండవద్దని సూచించారు. ఈ సమయంలో మద్యం ఎక్కడ అమ్మినా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల మూడున కూడా నల్లగొండ మున్సిపాలిటీలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.