తిరుమలగిరి, ఫిబ్రవరి 13 : తిరుమలగిరిలో శుక్రవారం ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. మొత్తం 15 వార్డులకు 10 వార్డుల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 5 వార్డులతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ డబ్బు, మద్యం పంపిణీ చేసినా.. కేసీఆర్ చేసిన అభివృద్ధికి కానుకగా తిరుమలగిరిలో 10 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు. బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగి మున్సిపల్ చైర్మన్ పిఠం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అసత్య హామీలను ప్రజలు పసిగట్టి గుణపాఠం చెప్పారు. 1, 2, 3, 4, 10, 11, 12, 13, 14, 15 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 5, 6, 7, 8, 9 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ప్రచారం చేసి.. దండిగా నిధులు తెచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని ప్రటించినా.. ప్రజలు వారి మాటలను పట్టించుకోలేదు. గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ఏమీ చేయలేదు. మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతల్లో చూపడం లేదని ప్రజలు విశ్వసించారు. అందుకే అధికార పార్టీకి ఆదరణ కరువైంది.
తిరుమలగిరి మున్సిపాలిటీ 2018 ఏర్పాటు చేశా రు. మొదటిసారి 2020లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు బీఆర్ఎస్ 11 స్థానాలు, కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయం సాధించాయి. నాడు పోలింగ్ 88.77 శాతం నమోదైంది. 2026 ఫిబ్రవరి 11న జరిగిన ఎన్నికల్లో అదే జోష్‌తో బీఆర్ఎస్ 10 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ను 5 స్థానాలకే పరిమితం చేశారు. పోలింగ్ 88.36 శాతం నమోదైంది. రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్‌పై ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందో ఈ ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది.
తిరుమలగిరిలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిం ది. 2020లో, శుక్రవారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార బలంతో మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలు పెట్టి చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ దక్కించుకుంది. దీన్ని పసిగట్టిన మున్సిపల్ ప్రజలు నేడు తమ ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారు.
మున్సిపాలిటీలో అధికార పార్టీతో పాటు బీజేపీ, సీపీఎంకు చుక్కెదురైంది. మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో బీజేపీ 13 వార్డుల్లో పోటీ చేసినా ఒక్క వార్డులోనూ గెలవలేక పోయింది. సీపీఎం రెండు వార్డుల్లో పోటీ చేసినా ఒక్కటీ గెలవలేదు. వార్ వన్‌సైడ్ అన్నట్లుగా బీఆర్ఎస్ తన సత్తా చాటింది.
మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల ర్యాలీలు, ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అమలు చేయని గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులకే శంకుస్థాపనలు చేస్తూ కాంగ్రెస్ చేస్తున్న అసత్యాలను ప్రజలకు వివరించటంతో పాటు గెలుపు గుర్రాలనే బరిలో దించడంతో బీఆర్ఎస్ విజయం ఖాయమైంది.