సూర్యాపేట, ఫిబ్రవరి 6 : సూర్యాపేట జిల్లా కేంద్రం లో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయా వార్డుల్లో గులాబీ సైన్యం దండు కట్టి గడపగడపకు తిరుగుతూ శుక్రవారం ప్రచారం నిర్వహించింది. ఆయా వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ‘అభివృద్ధి చేసే కారు గుర్తుకే మా ఓటు. పదేండ్ల అభివృద్ధిని మరిచేది లేదు. కేసీఆర్‌ను వదిలేది లేదు’ అని ఓటర్లు ముక్త కంఠంతో చెబుతున్నారు. శుక్రవారం పట్టణంలోని 16, 48, 18, 31, 30వ వార్డుల్లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆయా వార్డుల్లో బీజేపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వారందరికీ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ‘కాంగ్రెస్ అంటేనే కబ్జాలు.. కూల్చివేతలు. బీఆర్ఎస్ అంటే అభివృద్ధి, ప్రశాంత వాతావరణం. ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలి’ అని అన్నారు.
కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లల్లో గూండాయి జం, గంజాయిజం పెరిగింది తప్ప ఎక్కడ రూపాయి పని కాలేదని, తట్టెడు మట్టి పోయలేదని అన్నారు. వాళ్లకు ఓటేస్తే అవినీతి దౌర్జన్యాలను పెంచి పోషించినట్టేనని, పదేండ్ల పాలనలో అభివృద్ధికి, ప్రశాంతతకు కేరాఫ్‌గా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏం చేశారని, ఓటు అడగడానికి వచ్చే నాయకులను ప్రశ్నించాలని చెప్పారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు కాంగ్రెసోళ్లు వార్డులు పంచుకున్నారని, కొట్టే చేతికి కర్ర.. దొంగ చేతికి తాళం ఇవ్వొద్దని అన్నారు. వాళ్లు వార్డులు పంచుకున్నది దోచుకునేందుకేనని, కాంగ్రెస్‌లో మంత్రులే సిగ్గు లేకుండా దోచుకుంటున్నారని అన్నారు. ప్రజలను మోసం చేసి దోచుకోవడం వాళ్లకు కొత్తేమీ కాదన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత పదేండ్లల్లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. 30 సంవత్సరాల మూసీ మురికి నీటిని తాగిన ప్రజలకు స్వచ్ఛమైన కృష్ణా నీటిని మిషన్ భగీరథ పథకం ద్వారా అందించామన్నారు. కాంగ్రెస్ నాయకులు రెండేండ్లుగా దౌర్జన్యా లు చేస్తూ మన ఆస్తులు తింటుంటే.. వాళ్లు పెంచిన దోమలు మన రక్తం పీలుస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2,500 వస్తాయని ఆశపడ్డారని, యువతకు రెండు లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు స్కూటీలు వస్తాయని కన్న కలలు కల్లలుగానే మిగిలాయన్నారు. ‘ఒక వార్డుకు కౌన్సిలర్‌ను ఎన్నుకోవడం అంటే మీ ఇంటి మనిషిని ఎన్నుకోవడమే. ఫోన్ చేస్తే మీ ఇంటి ముందుకు వచ్చే వాళ్లను ఎన్నుకోవాలి. అప్పుడే మీ ప్రతి సమస్య పరిష్కారమవుతుంది’ అని చెప్పారు. కాంగ్రెస్‌కు ప్రజలను మోసం చేయడం కొత్తేమీ కాదన్నారు. అందుకే కాంగ్రెసోళ్లకు ఓటు అనే ఆయుధంతో సరైన బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఇస్లావత్ రాంచందర్ నాయక్, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఆయా వార్డుల అభ్యర్థులు రంగినేని ఉపేందర్‌రావు, వాంకుడోతు సక్రునాయక్, కొండపల్లి సాగర్‌రెడ్డి, మేక భారతి వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు ఉప్పల ఆనంద్, మారిపెద్ది శ్రీనివాస్, నెమ్మాది భిక్షం, జీడి భిక్షం, మద్దెల వీరస్వామి, నాతాల వెంకటరెడ్డి, సైదిరెడ్డి, డాక్టర్ బక్కయ్య, అమ్రునాయక్, గౌతమ్, నరేశ్, జ్యోతి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.