యాదాద్రి భువనగిరి, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం బిల్లులు లబ్ధిదారులకు అందడంలేదు. జిల్లాలో ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు బిల్లులు రాక పరేషాన్ అవుతున్నారు. నిర్మాణ పనులు పూర్తి చేసుకొని చివరి దశ బిల్లుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 4591 ఇండ్ల నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులు నిధుల కోసం నెలలుగా నిరీక్షిస్తున్నారు. అప్పులు తెచ్చి ఇండ్లు కట్టి ఇప్పుడు పైసల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.
యాదాద్రిలో 9618 ఇండ్లు మంజూరు..
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం ప్రభుత్వం అనేక నిబంధనలు తెచ్చింది. ఇంటి స్థలం ఉన్నవారికి, ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా నిర్మాణం, రెండు గదులు, ఓ వంట గది, బాత్ రూమ్ ఉండలా ఇంటి నిర్మాణం చేపట్టాలి. లబ్ధిదారుల ఎంపికకు గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆయా కమిటీలు తయారు చేసిన జాబితాను తాసీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్లతో కూడిన మండల స్థాయి బృందం స్వయంగా ధ్రువీకరించి పరిశీలించింది. జిల్లాలో మొత్తంగా 9618 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇంకా 1119 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. బేస్మెంట్ స్థాయిలో 1094, రూఫ్ లెవల్లో 542, రూఫ్ కాస్ట్ లెవల్లో 3153 నిర్మాణలు ఉన్నాయి. అయితే ఆర్థిక స్థోమత లేని పేదలకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించారు. ఇక పథకం ప్రారంభంలో ప్రతి సోమవారం ఠంచనుగా బిల్లులు జమ అయ్యేవి. కానీ ఇప్పుడు వారా లు, నెలలు గడుస్తున్నా డబ్బులు వేయడంలేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
4591 ఇండ్లు పూర్తి..బిల్లులేవీ మరి..
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తంగా 4591 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో అనేక మంది శుభ ముహూర్తాలు ఉండటంతో ఇప్పటికే అనేక మంది గృహ ప్రవేశాలు చేశారు. కానీ ఆఖరికి బిల్లు మాత్రం పెండింగ్లోనే మూలుగుతున్నది. ఇప్పటికే వరకు దశలవారీగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.40 లక్షలు మాత్రమే విడుదల చేసింది. ఇంకా రూ. 1.60 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ త్వరగా పూర్తి చేస్తే.. బిల్లులు వస్తాయని పలువురు అప్పులు తెచ్చారు.
నెలలు గడుస్తున్నా ఇంకా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇచ్చిందని, కేంద్రం నుంచి రావల్సిన వాటానే పెండింగ్లోనే ఉందని అధికారులు చెబుతున్నారు. అన్ని దశల్లో ఫొటో క్యాప్చరింగ్ పూర్తియినా చివర దశ బిల్లులు రాకపోవడంతో అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కాగా రూ. 1.60 లక్షల్లో ఈజీఎస్ కింద రూ. 40వేలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ. 1.20 లక్షలు రావాల్సి ఉందని పేర్కొంటున్నారు. జిల్లా మొత్తంలో వివిధ దశలకు సంబంధించి 224 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కాగా త్వరలోనే చివరి దశ బిల్లులు వస్తాయని హౌజింగ్ పీడీ అలివేలు తెలిపారు.
వాసాలమర్రిలో 143 మందికే ఇండ్లు..
తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో అందరికీ ఇస్తామని గొప్పగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వ.. అమలులో మాత్రం చతికిల పడింది. మొత్తంగా 240 మంది వరకు ఇండ్లు ఇస్తామని, ఆఖరికి 143 మందికి మాత్రమే మంజూరు చేసింది. ఇందులో స్టేట్ రిజర్వుడ్ కోటా నుంచి 119 ఇండ్లు, ఎమ్మెల్యే కోటా నుంచి 22 ఇం డ్లు శాంక్షన్ చేశారు. ప్రస్తుతం అవి నిర్మా ణ దశలో ఉన్నాయి. అప్పటి సీఎం కేసీఆర్ దత్త త గ్రామం కావడంతో పొలిటికల్ గేమ్ ఆడాలని చూసి నా.. ఆఖరికి కొందరికే ఇచ్చారు. దీంతో మిస్ ఫైర్ అయ్యిందనే ప్రచా రం జరుగుతున్నది.