నల్లగొండ ప్రతినిధి, జనవరి21(నమస్తే తెలంగాణ) : లోక్‌సభ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఇప్పటికే ఈ నెల 12వ తేదీన భువనగిరి స్థానంపై సమీక్ష పూర్తి కాగా నేడు నల్లగొండ లోక్‌సభ స్థానంపైన రివ్యూ మీటింగ్ జరుగనున్నది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వేదికగా జరిగే ఈ సమీక్ష సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా దిశానిర్దేశం చేయనున్నారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తూనే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. సోమవారం నాటి సమీక్ష సమావేశంలో నల్లగొండ లోక్‌సభ పరిధిలోని ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులంతా తరలివెళ్లనున్నారు.
నేడు జరిగే సమావేశానికి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సగటున 100 మంది చొప్పున మొత్తం ఏడు స్థానాల నుంచి 700 మంది వరకు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్తోపాటు లోక్‌సభ స్థానం పరిధిలోని జిల్లా పార్టీల అధ్యక్షులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర, జిల్లా కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు, మండల స్థాయి ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా ముఖ్యులతో మాట్లాడించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై పోస్టుమార్టం చేస్తూ లోక్‌సభ ఎన్నికల సన్నద్ధంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిసింది. కాగా నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలో నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఇందులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం సూర్యాపేటలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుపొందగా మిగతా ఆరు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక ఇదే సమయంలో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండలో స్వల్ప తేడాతో కాంగ్రెస్ గెలుపొందింది. అయినా సరే నల్లగొండ లోక్‌సభ స్థానంపైన ఈ సారి గులాబీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ఎన్నికలకు సిద్ధం కానున్నది. అందులో భాగంగానే నేడు జరుగనున్న సమావేశంలో యువనేత కేటీఆర్ ఓవర్ ఆల్గా అన్ని అంశాలను క్రోడీకరిస్తూ దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.