నల్లగొండ ప్రతినిధి, జూలై 8(నమస్తే తెలంగాణ):కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పలు కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు బుధవారం సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో పాటు రైతు, విద్యార్థి, యువజన ప్రజా సంఘాలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. గత పక్షం రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలంటూ కార్మిక సం ఘాలు అనేక కార్యక్రమాలు నిర్వహించాయి.
సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా అంతటా ర్యాలీలు, సభలు నిర్వహించారు. కార్మిక సంఘాల ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా మోదీ సర్కార్ తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, కనీస వేతనం 26వేలుగా నిర్ణయించాలని, పనిహక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, కనీస పెన్షన్ రూ.9వేలు ఇవ్వాలని, సామాజిక భద్రత కల్పించాలని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలనే తదితర డిమాండ్లతో దేశవ్యాప్త సమ్మెకు దేశంలోని 11 ప్రధాన ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి.
అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ బీఆర్టీయూ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, టీయూసీఐ, టీఎన్టీయూసీ, ఏఐయూటీయూసీ కార్మిక సంఘాలు కొద్ది రోజులుగా సమ్మెను విజయ వంతంచేయాలంటూ విస్తృత ప్రచారం చేశాయి. రైల్వే, విమానయాన, బ్యాంకింగ్, బీమా, పోస్టల్, టెలికాం లాంటి కేంద్ర ప్రభుత్వ సం స్థల్‌లోని ఉద్యోగ సంఘాలు సైతం సంఘీభావం ప్రకటించాయి.
సమ్మె నోటీసులు జారీ..
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పలు కార్మిక సంఘాలు పరిశ్రమలు, సంస్థల యజమాన్యాలను కలిసి సమ్మె నోటీసులు అందజేశాయి. ఇదే సమయంలో కార్మిక వర్గంతో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ సమ్మె ప్రాధాన్యతను వివరించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఆర్టీయూ ఆధ్వర్యంలో జిల్లాలోని రైస్‌మిల్లులు, గ్రానైట్ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, సిమెంట్ ఇండస్ట్రీలు, నాపరాయి పరిశ్రమలు, ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ తదితర వాటితోపాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ ప్రచారం చేస్తూ, నోటీసులను అందజేశారు. సమ్మెలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 3లక్షల మంది భాగస్వామ్యం కానున్నట్లు తెలిపారు.