కొండమల్లేపల్లి, మే 18 : వృద్ధాప్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో పాటు తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని కొండమల్లేపల్లికి చెందిన వృద్ధ దంపతులు గుంటోజు దక్షిణామూర్తి, కమలమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. దక్షిణమూర్తి గతంలో విద్యుత్తుశాఖలో పనిచేసేవాడు. విధి నిర్వహణలో భాగంగా 2001లో విద్యుత్తు స్తంభంపై నుంచి కిందపడటంతో వెన్నెముక్కకు గాయాలు కావడంతో పాటు కాలు విరిగింది. చికిత్స అనంతరం కోలుకున్నా.. ఆరోగ్యం సహకరించకపోవడంతో స్వచ్ఛందంగా విరమణ చేసి, పెద్ద కుమారుడైన వెంకటేశ్వర్లుకు ఇప్పించారు.
ప్రస్తుతం విద్యుత్ సంస్థలో లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ప్రతినెలా వైద్య ఖర్చులకు సుమారు రూ.50 వేలకు పైగా ఖర్చు వస్తోందన్నారు.పెన్షన్ సరిపోక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆలనా పాలన చూసుకుంటానని చెప్పిన పెద్ద కుమారుడు ఆరేండ్లుగా పట్టించుకోవడంలేదన్నారు. దీంతో పాటు మూడెకరాల భూమి, తొమ్మిది గుంటల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించాడని, దీంతో తాము ఆస్తులను విక్రయించలేకపోతున్నామన్నారు. అధికారులు జోక్యం చేసుకొని తమ ఆస్తుల్ని తాము విక్రయించుకునేలా వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.