యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పండుగలకు ఆయా వర్గాలకు ఇచ్చే కానుకలకు కాంగ్రెస్ సర్కార్ పాతరేసింది. కొత్తగా పేదలకు ప్రోత్సాహకాలు ఏమీ ఇవ్వకపోగా.. ఏటా అందజేస్తున్న కానుకలకు మంగళం పాడింది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే రంజాన్ తోఫా, బతుకమ్మ చీరెల పంపిణీకి స్వస్తి పలికింది. దీంతో ఆయా వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
రంజాన్‌తోఫా కట్..
తెలంగాణ ఏర్పాటు తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో భాగంగా రంజాన్ పర్వదినం పురస్కరించుకొని అర్హులందరికీ రంజాన్ తోఫా అందించారు. చీరె, జాకెట్, పంజాబీ డ్రెస్ మెటీరియల్, లాల్చి, పైజామా మెటీరియల్‌తో కూడిన కానుకల కిట్‌ను పవిత్రమైన పండుగ సందర్భంగా ఇచ్చేవారు. గిఫ్ట్ ముందుగానే జిల్లాలకు వచ్చేవి. వాటిని నియోజకవర్గాలు, మండల కేంద్రాలకు తరలించేవారు. రంజాన్ ముందు దినాల్లోనే కానుకలు పంపిణీ చేసేవారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. గతేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19,500మందికి కానుకులను అందించారు. అందులో యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,500, నల్లగొండలో 10,500, సూర్యాపేటలో 6,500 తోఫాలు ఉన్నాయి. కానీ ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి కానుకల పంపిణీపై కార్యాచరణ రూపొందించ లేదు. ఏకంగా రంజాన్ తోఫాను బంద్ చేసింది.
బతుకమ్మ చీరెలు బంద్..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నాటి బీఆర్ఎస్ సర్కారు గౌరవించింది. స్వరాష్ట్రంలో బతుకమ్మ పండుగను గుర్తించి వైభవంగా నిర్వహించింది. పండుగకు కానుకగా 18 ఏండ్లు నిండిన పేద మహిళలకు 2017 నుంచి ఏటా బతుకమ్మ చీరెలను పంపిణీ చేసింది. రకరకాల రంగులు, 250 డిజైన్లతో నాణ్యత గల చీరెలను అందించింది. గతేడాది జిల్లాలో 2.50లక్షల చీరెలను పంపిణీ చేసింది. నాడు బతుకమ్మ చీరెల పంపిణీ పండుగలా సాగేది. ఉచిత చీరెలతో బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకొనేవారు. కానీ చీరెల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం నుంచే అటకెక్కించింది.
కేసీఆర్‌కు పేరొస్తుందననేనా..?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు సమానంగా చూశారు. అన్ని మతాల సంక్షేమాన్ని కాంక్షించారు. ఆయా పండుగలకు కానుకలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వాటిని నిలిపేసింది. కేసీఆర్ తీసుకొచ్చిన కార్యక్రమాలు కావడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే అమలు చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయం కోసం పేదలకు పంపిణీ చేయాల్సిన వాటిని బంద్ చేయడంతో ఆయా వర్గాల నిరుపేదలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా క్రిస్మస్ కానుకలు..!
ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ రంజాన్ తోఫా, బతుకమ్మ చీరెల పంపిణీని నిలిపేయగా.. ఇప్పుడు క్రిస్మస్ కానుక వంతు వచ్చింది. జిల్లాలో ఇప్పటికే క్రిస్మస్ కానుకలను పంపిణీ చేయాల్సి ఉంది. గతంలో ఇదే సమయానికి పేద క్రిస్టియన్లకు గిఫ్ట్‌లు అందేవి. గిఫ్ట్ ప్యాకుల్లో ఒక చీరె, పంజాబీ డ్రెస్, ప్యాంట్, షర్టు ఉండేవి. కుటుంబంలోని తల్లిదండ్రులకు, కుమార్తెకు దుస్తులు ఇచ్చేవారు. జిల్లాలో ఏటా 2వేల కానుకలు పంపిణీ చేసేవారు. ఆయా నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేసేవారు. కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు గిఫ్ట్‌లు పత్తాలేవు. అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు లేవని స్పష్టం చేస్తున్నారు. దీంతో క్రిస్మస్ కానుకలకు కూడా మంగళం పాడినట్లయింది.
మార్పు అంటే ఇదేనా..?
నాడు కేసీఆర్ సర్కార్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేసింది. రంజాన్ తోఫాతో పేద ముస్లింలు ఎంతో సంబురంగా పండుగ జరుపుకునేవారు. తెలంగాణ ఆత్మగౌరవం బతుకమ్మ పండుగకు మహిళకు చీరెలు ఇచ్చేది. దీని వల్ల నేతన్నలకు ఉపాధి కూడా లభించేది. బతుకమ్మ చీరెలను కూడా ఈసారి సర్కారు అదించలేదు. పండుగ దగ్గరికొచ్చిన ఇంకా క్రిస్మస్ కానుకల ఊసే లేదు. పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగించాల్సింది పోయి.. బంద్ చేయడం ఏంటి..? ఇదేనా మార్పు అంటే.. కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు.
-కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు