రామగిరి, మే 31 : ఫ్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించే నోట్‌బుక్స్ జిల్లా పుస్తక విభాగానికి చేరుకున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాటిని మండల కేంద్రాల్లోని ఎంఆర్సీలకు ప్రత్యేక వాహనాల్లో తరలించే పనిని శుక్రవారం ప్రారంభించారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 1,485 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతోపాటు వైట్, సింగిల్ రూల్ నోట్ బుక్స్‌ను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. పాఠశాల ప్రారంభం రోజు జూన్ 12న వీటిని అందించనున్నారు. ఇప్పటికే ఆయా పాఠశాలలకు తొలి విడుతలో పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తయ్యింది.
ఇప్పుడు నోట్ బుక్స్‌తోపాటు రెండో విడుత పాఠ్య పుస్తకాలు సైతం సరఫరా చేస్తున్నారు. మొదటి రోజు తిప్పర్తి, చందంపేట, నేరడుగొమ్ము, గుండ్లపల్లి మండలాలకు నోట్‌బుక్స్ సరఫరా చేసినట్లు జిల్లా సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారి ఆర్.రామచంద్రయ్య తెలిపారు. డీఈఓ బి.భిక్షపతి ఆదేశాలతో వీటిని పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 4,06,178 వైట్ నోట్ బుక్స్ అవసరం ఉండగా ఇప్పటి వరకు 2,80,900.. సింగిల్ రూల్ నోట్ బుక్స్ 81,815 అవసరం ఉండగా 37 వేలు వచ్చాయని అధికారులు తెలిపారు. మిగిలినవి రెండో విడుతలో రానున్నట్లు వెల్లడించారు.
6, 7వ తరగతి విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ 5 సింగిల్ రూల్, 1 ప్లెయిన్ నోట్ బుక్స్ ఇస్తారు. 8వ తరగతి విద్యార్థులకు 7 ప్లెయిన్, 9, 10వ తరగతి విద్యార్థులకు 14 ప్లెయిన్ నోట్స్, 11, 12వ తరగతి విద్యార్థులకు 12 ప్లెయిన్ నోట్ బుక్స్ అందజేస్తారు.