– కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల వైఫల్య పాలనపై సూర్యాపేటలో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ
సూర్యాపేట, సెప్టెంబర్ 02 : మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పి తరిమికొట్టే రోజులు ఆసన్నమయ్యాయని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులైనా అమలు చేయకపోవడంపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా 420 మీటర్ల ఫ్లెక్సీపై 420 హామీలను ప్రదర్శిస్తు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. 2014కు ముందు తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టు, నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వాళ్ల కాళ్ల ముందు పెట్టాడన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తూ పదవులు, అవినీతి సొమ్మును పంచుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసారన్నారు.
పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జోలికి వస్తే సహించేది లేదని, ఆయన పట్ల నోరు పారేసుకుంటే జైలుకు పంపడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు.. 33 నెలలు కావస్తుండగా 420 హామీలలో ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలపై అదనపు భారాలు మోపుతూ ఇబ్బందుల పాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలన అందించి భారతదేశానికి ఆదర్శం చేసిందన్నారు. బీఆర్ఎస్ గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటుందని, ప్రజల వెంట, ప్రజల కోసం పని చేస్తుందన్నారు.

ఢిల్లీ వాళ్ల కాళ్ల ముందు తెలంగాణ ఆత్మ గౌరవం : మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాజీ పెరుమాళ్ల అన్నపూర్ణ మాట్లాడుతూ.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పదేళ్ల పాటు రాష్ట్రానికి ఆదర్శంగా సేవలందిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఒక్క శిలాఫలకం కూడా వేయలేదన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి జాతీయ నాయకులను తీసుకువచ్చి 420 హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. యువతకు రెండు లక్షల ఉద్యోగాలు, రైతులకు రైతు భరోసా రుణమాఫీ, కరెంటు, ఎరువులు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కటి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి పాలన చేదు నిజమని ప్రజలకు అర్థమైంది అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మూడు గుంపులుగా అవాకులు చవాకులు పేలుతున్నారని ముందు వారు ఏ గుంపో తేల్చుకోవాలన్నారు. సద్దుల చెరువుపై మొక్కలకు నీళ్లు పోయలేని దద్దమ్మలు వాళ్లు అన్నారు. పత్తి, వరి చేలకు నీళ్లు లేక ఎండుతున్నాయని, రైతులకు నీళ్లు లేక, కరెంటు లేక, యూరియా లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలనే ప్రధాన లక్ష్యంతో వారం రోజుల ఉద్యమ కార్యచరణను రూపొందించడం జరిగిందన్నారు. ఈ ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములై ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.