నల్లగొండ ప్రతినిధి, మే31(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేటి నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. నేడు, రేపు హైదరాబాద్‌లో, ఎల్లుండి జిల్లాల్లో కార్యక్రమాల నిర్వహణకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్‌బండ్ వద్ద గల అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అమరులకు ఘనంగా నివాళులర్పించనున్నారు.
ఇక ఆదివారం దశాబ్ద కాలం గడుస్తున్న నేపథ్యంలో ముగింపు వేడుకల పేరుతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సభ కేసీఆర్ అధ్యక్షతన జరుగనుంది. ఇదే సమయంలో జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రులు, అనాథ శరణాలయాలు, పలు సంస్థల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పండ్లు, స్వీట్ల పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 3వ తేదీన అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో ముగింపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి జిల్లా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాల ఆవరణలో జాతీయ పతాకంతోపాటు పార్టీ పతకాన్ని కూడా ఎగురవేసేలా కార్యాచరణ ప్రకటించారు.
జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఆదివారం ఉదయం 9గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో కలెక్టర్లు జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించనున్నారు. శనివారం సాయంత్రమే కలెక్టర్, మున్సిపల్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను లైటింగ్‌తో అలకరించేందుకు ఆదేశాలిచ్చారు. రేపటి అవతరణ వేడుకల ఏర్పాట్లపై నల్లగొండ కలెక్టర్ హరిచందన శుక్రవారం సమీక్ష నిర్వహించి తగిన ఆదేశాలిచ్చారు.