– బీఆర్ఎస్ పార్టీ చండూరు పట్టణ మండల నాయకులు
చండూరు, మార్చి 24 : చండూరు పట్టణ కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ చండూరు పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓ పద్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న “మోడల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్” (ఉదా: ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్) తరహాలో చండూరులో కూడా అధునాతన సదుపాయాలతో కూడిన పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేసే ప్లాన్ ప్రకటించిన నేపథ్యంలో చండూరు పట్టణ కేంద్రానికి రావాల్సిన ఈ పాఠశాలను కొందరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మర్రిగూడకు తరలించాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుండి ఆధునిక వసతులతో ఈ బడులు ప్రీ-ప్రైమరీ నుండి 12 (KG to PG) తరగతులకు విస్తరిస్తాయి. ఈ పాఠశాలల్లో AI బోధన, ఉచిత అల్పాహారం, పూర్తి స్టూడెంట్ కిట్లు అందిస్తూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం సంతోషకరమన్నారు. కావున అత్యాధునిక తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ మరియు క్రీడా ప్రాంగణం కల్పిస్తారు.కాబట్టి ఈ తరహా స్కూల్ కోసం మన చండూరు హైస్కూల్ అన్ని విధాల అర్హత కలిగి ఉన్నదన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో మోడల్ స్కూల్స్, గురుకులం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరిట ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ విద్య అందిస్తున్నారన్నారు. మునుగోడులో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మర్రిగూడ, నాంపల్లి మండలాలలో మోడల్ స్కూల్, నారాయణపురం మండలం సర్వేల్ లో గురుకుల పాఠశాల ఉన్నట్లు చెప్పారు.
ఒక్క చండూరు మండల కేంద్రంలోనే నాణ్యమైన వసతులతో కూడిన ప్రభుత్వ పాఠశాల లేనందున తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) చండూరులో ఏర్పాటు కోసం చేయాలని వినతి పత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్తపార్టీ సతీష్, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, మండల అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, మండల కార్మిక విభాగం అధ్యక్షుడు చొప్పరి దశరథ యాదవ్, కౌన్సిలర్ కొండ్రెడ్డి మధు, కర్నాటి మల్లేష్, ఇరిగి గురునాథం, ఇరిగి రామకృష్ణ, ఇడికోజు నాగరాజు, రాపోలు జగదీష్, మహమ్మద్ గౌస్, మాధగోని నాగార్జున, భూతరాజు వెంకన్న, పడసనబోయిన పాండు, అబ్దుల్ పాల్గొన్నారు.