తిరుమలగిరి మే 4 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర వస్తుందని ఆశించిన రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు తెస్తే అధికారులు పట్టించుకోకుండా సగం ముంచితే..అదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షం నిండా ముంచింది. 15 రోజుల కిత్రం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి విక్రయించుదామనుకుంటే రైతులను పట్టించుకునే వారే లేరు. లారీలు రాక ,కాంటాలు వేయక, పదిహేను రోజుల నుంచి ఎండబెట్టి ,ఆరబోసి నాణ్యమైన ధాన్యం వర్షానికి తడిసి పోవటంతో ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందో.. లేదో కనీసం తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తుందో లేదోననే ఆందోళన రైతుల్ల్లో కనిపిస్తోంది.
రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాల కోసం ఎదురు చూస్తున్నా అధికారులు పట్టించుకోక పోవటంతో ఆకాల వర్షం రూపంలో రైతులు పండించిన ధాన్యం ఆగమైంది. కాంటాల్లో ఆలస్యం, లారీలు రాక కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు యాప్లో నమోదు చేసి ఆన్లైన్ చేసే ప్రక్రియ రైతులను ఇబ్బందులకు గురిచేసింది. కొనుగోలు కేంద్రాల్లో వర్షం వస్తే ధాన్యంపై కప్పేందుకు టార్పాలిన్ కవర్లు లేకపోవడంతో ధాన్యం తడిసింది.
కొనుగోలు కేంద్రాల్లో కనీసం తాగునీరు, టెంట్ ,టార్పాలిన్ కవర్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రం వర్షపు నీరు ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేయటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కాల్వలు తీసి వరద నీరు బయటకు వెళ్లేలా తిప్పలు పడ్డారు. అదే విధంగా అనేక సెంటర్లలో సరైన సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే ఆన్లైన్ నమోదు చేసుకొని ఫామ్లు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో చాలామంది రైతులు తాము పండించిన పంట వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకున్నా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. దీంతో తక్కువ ధర వచ్చినా.. అంతే చాలు అనుకుంటూ చాలా మం ది రైతులు వ్యవసాయ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో దళారులు వ్యవసాయ మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి రైతులకు క్వింటాకు రూ. 50 ఇస్తామని ఆశ చూపి వారి అకౌంట్లో డబ్బు పడగానే డ్రా చేసుకోని లాభాలు గడిస్తుస్తూ..ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు.

పెన్పహాడ్, మే 4: ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతోపాటు ఎటుచూసినా వడ్ల కుప్పలు..రోడ్ల వెంట వడ్ల ట్రాక్టర్లు దర్శనమిస్తున్నాయి. ఒక వైపు ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. రెండు మూడు రోజుల్లో పెన్పహాడ్ మండలంలో ఎక్కడో ఒక చోట వర్షం కురుస్తూనే ఉంది. ఆదివారం సాయంత్రం మండలంలో వర్షం కురిసింది. దీంతో రైతులు వడ్ల కుప్పలపై టార్పాలిన్లు కప్పి పంటను కాపాడుకునే ప్రయత్నం చేశారు. 20 రోజులుగా ఇక్కడి సెంటర్కు వడ్లు తీసుకొచ్చామని ఇప్పటివరకు ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేదని అనంతారం, దోసపహాడ్ గ్రామాలకు చెందిన రైతులు వాపోతున్నారు.
ధాన్యం తేమ శాతం వచ్చినప్పటికీ వడ్లు కొనకపోవడంతో ఎదురు చూస్తూ రోజుల తరబడి కుప్పల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాల ముప్పుతో ఆందోళన చెందుతున్నారు. ఆదివారం వర్షం కురవడంతో ఆందోళన చెందిన కొందరు రైతులు ఫోన్లో సెల్ఫీవీడియో రికార్డు చేసి తమ గోడును సోషల్ మీడియాలో వెల్లబుచ్చుకున్నారు. హమాలీల కొరత కారణంగా కొనుగోళ్లు చేపట్టలేకపోతున్నామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని రైతులు మండిపడుతున్నారు.
పదిహేను రోజుల క్రితం తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో 240 బస్తాల ధాన్యం తెచ్చి విక్రయిద్దామనుకుంటే ఇప్పటి వరకు పట్టించుకునే వారే లేరు. ఆదివారం కురిసిన వర్షానికి మార్కెట్లోని వర్షపు నీరంతా ధాన్యపు రాశుల్లోకి చేరడంతో మొత్తం తడిసింది. అధికారులు కాంటాలు వేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కనీసం వర్షం వస్తే ధాన్యం తడవకుండా కప్పేందుకు టార్పాలిన్ కవర్లు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలంటేనే రైతులకు విరక్తి వచ్చేలా ఉంది.
-మాళోతు మంగూ నాయక్, రైతు, రావిచెరువు తండా, వెలిశాల
ఎటు పడి రైతులే ఆగం అయితున్నరు తప్ప ఎవరికీ ఏం బాధలేదు. ఎంతో కష్టపడి పంట పండిస్తే పట్టించుకునే వారేలేరు. రోజులు గడుస్తున్నా కాంటాలు కావటం లేదు. లారీలు రావటం లేదు. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్నాయని చెబుతున్నారు. అధికారులు పట్టించుకోని తొందరగా కాంటాలు వేసి రైతులను ఆదుకోవాలి.
-మాళోతు లాలూ నాయక్, రైతు, వెలిశాల