కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల కష్టాలు తీరాయి. కార్మిక రంగంలో ఏ ఒక్క వర్గాన్నీ కాదనకుండా ప్రభుత్వం ఆదుకుంటున్నది. గతానికి భిన్నంగా కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రమాద, ఆరోగ్య బీమా అందిస్తూ ఆపత్కాలంలో తోడుంటున్నది. అర్హులలైన కార్మికులకు పింఛన్లూ ఇస్తూ ఆసరా అవుతున్నది. కార్మికులకు బోనస్, జీతాలు పెంచుతూ అండగా ఉంటున్నది. మన వారితోపాటు వలస కార్మికులకు చేతినిండా పని కల్పిస్తూ భరోసా కల్పిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ వారి పొట్టగొడుతున్నది. కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నది. దేశమంతా తెలంగాణ మోడల్ అమలు కావాలన్నా.. ప్రభుత్వ రంగ సంస్థలు యథావిధిగా నడువాలన్నా దేశానికి సీఎం కేసీఆర్ ఎంతో అవసరమమని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలని, తామంతా అందుకు సంపూర్ణ మద్దతు తెలుపుతామని చెబుతున్నారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఏ లక్ష్యాలతో తెలంగాణ ఉద్యమం సాగిందో ఆ లక్ష్యాలే కాకుండా ఎవరూ ఊహించని విధంగా…ప్రతిపక్షాలు సైతం మెచ్చుకునేలా సీఎం కేసీఆర్ నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. దాంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవనం గడుపుతున్నారు. స్వరాష్ట్రంలో కార్మిక లోకం చీకట్ల నుంచి వెలుగులోకి వచ్చింది. కొట్లాడి సాధించుకున్న తెలం గాణలో కార్మికుల కష్టాలు తీరాయి. కార్మిక రంగంలో ఏ ఒక్క వర్గాన్ని కాదనకుండా అందరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటున్నది. గతానికి భిన్నంగా కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రమాద, ఆరోగ్య బీమా అందిస్తూ ఆపత్కాలంలో తోడుంటున్నది. అర్హులైన కార్మికులకు పింఛన్లు ఇస్తూ ఆసరా అవుతున్నది. కార్మికులకు బోనస్, జీతాలు పెంచుతూ అండగా ఉంటున్నది. వలస కార్మికులతోపాటు మన కార్మికులకు చేతినిండా పని కల్పిస్తూ భరోసా కల్పిస్తున్నది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ వారి పొట్టగొడుతున్నది. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిలువునా అమ్మేస్తున్నది. దేశమంతా తెలంగాణ మోడల్ అమలు కావాలన్నా.. ప్రభుత్వ రంగ సంస్థలు యథావిధిగా నడవాలన్నా దేశానికి సీఎం కేసీఆర్ ఎంతో అవసరమని కార్మికులు, కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాల్సిందేనని బలంగా కోరుతున్నాయి. తామంతా సంపూర్ణ మద్దతు తెలుపుతుమని స్పష్టం చేస్తున్నాయి.
కార్మిక హక్కులను కాలరాస్తున్న బీజేపీ..
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నది. కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. అడ్డమైన చట్టాలను తీసుకొస్తూ నిలువునా ముంచుతున్నది. పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. కొన్నింటిని ఏకంగా ప్రైవేట్‌కు అమ్మేస్తున్నది.దాంతో కార్మికుల ఉపాధి, సంక్షేమంపై దెబ్బకొడుతున్నది. కేంద్రం రోడ్డు రవాణా సవరణ చట్టాన్ని తీసుకొచ్చి కార్మికుల కుటుంబాలను రోడ్డుపైకి నెడుతున్నది. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్‌పరం చేస్తున్నది. గతంలో ఉన్న 44 చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు నల్ల చట్టాలను తీసుకొచ్చింది. కొత్త చట్టాల ప్రకారం రోజుకూ 12 గంటలైనా పనిచేయించుకోవచ్చు. దీనిపై దేశ వ్యాప్తంగా కార్మిక లోకం భగ్గుమంది.
కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..
రాష్ట్రంలో అర్హులైన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందిస్తున్నది. చేనేత, గీత కార్మికులు పింఛన్లు ఇస్తుంది. ఆటోలకు పన్ను రద్దు చేసింది. కరోనా సమయంలో వలస కార్మికులను ఆదుకుంది. వారికి సాయం చేయడంతోపాటు సొంత రాష్ర్టాలకు సురక్షితంగా తరలించింది. కరోనా సమయంలో డ్రైవర్లు తీవ్ర నష్టాల పాలవడంతో క్వార్టర్లీ ట్యాక్స్‌ను మాఫీ చేసింది. ఆర్టీసీ, సింగరేణి కార్మికులకు విరివిగా జీతాలు పెంచింది. ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయసు పెంచింది. నేతన్నలకు బీమా పథకం తెచ్చింది. చేనేత కార్మికులకు రసాయనాలు, నూలుపై సబ్సిడీ ఇస్తున్నది. 25వేల విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజ్ చేసింది. గీత, మత్స్యకారులకు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నది.
ఇంకా మరెన్నో కార్యక్రమాలు..
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే కార్మికులకు మేలు
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రవేశంతో దేశవ్యాప్తంగా కార్మికులకు మేలు చేకూరుతది. రాష్ట్రం ఏర్పడిన తరువాత కార్మికులకు వసతులు కల్పించి అన్ని విధాలా ఆదుకున్నాడు. లాక్డౌన్ సమయంలో ఇతర రాష్ట్ర కార్మికులు ఏ ఇబ్బందులు పడకుండా అన్ని సదుపాయాలు కల్పించి వారి సొంత రాష్ర్టాలకు పంపించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి వారికి అండగా నిలిచిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ ఆలోచన విధానాలు దేశంలో కార్మికుల సంక్షేమానికి ఎంతో మేలు చేస్తాయి. ఆటో కార్మికులకు బీమా కల్పించి వారి కుటుంబాలకు భరోసా కల్పించాడు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఆటో కార్మికులకు ఆర్థికభారం పడుతున్నది. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించే సమర్థత కేసీఆర్‌కు మాత్రమే ఉంది. సీఎం కేసీఆర్ లాంటి అనుభవం ఉన్న వ్యక్తి దేశ రాజకీయాల్లోకి వెళ్తే కార్మికులకు సముచిత స్థానం దక్కుతుంది.
– ఊట్కూరి నాగయ్య, ఆటో డ్రైవర్, మునుకుంట్ల (కట్టంగూర్)
బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
తెలంగాణ మాదిరిగా దేశం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు అందాలంటే అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది. నిత్యావసరాల ధరలపై జీఎస్టీ వసూలు చేయడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు పండించే పంటకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించకపోవడం దుర్మార్గం. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటుంది. దేశంలో మార్పు రావాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యం.
– దేపావత్ సర్దార్‌నాయక్, టీఆర్ఎస్కేవీ మండల ప్రధాన కార్యదర్శి(తిరుమలగిరి (సాగర్)
టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని రంగా లు అభివృద్ధి చెందుతున్నాయి. కార్మికులకు బీమా చేయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఇలాంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో ఉంటే ప్రతి మనిషి అభివృద్ధి చెందుతాడు. కూలీలకు బీమా పథకాలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. సమయపాలనలో కూడా మార్పు తీసుకొచ్చి పని చేసే వారికి మేలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. ఇలాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో ఉంటే రాష్ట్రంతో పాటు, దేశం కూడా అభివృద్ధి చెందుతది.
– బైరం శ్రీనివాస్, టీఆర్ఎస్ కార్మిక సంఘం మాజీ మండలాధ్యక్షుడు, (త్రిపురారం)
ఇక్కడ ప్రయోజనాలు నెరవేరాయి.. అక్కడా నెరవేరతాయి
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని కార్మిక లోకానికి అనేక ప్రయోజనాలు అందుతున్నాయి. కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే దేశ వ్యాప్తంగా కార్మికుల హక్కులు నెరవేరడం ఖాయం. రాష్ట్రంలో విద్యుత్, నీరు పుష్కలంగా అందుతుండడంతో వ్యవసాయం పండుగలా మారి అన్ని రంగాలు అభివృద్ధ్ది పథంలో పయనిస్తున్నాయి. కార్మికులకు చేతినిండా పని దొరుకుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 8 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్లు వస్తున్నాయి. ఓ పక్క కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక
హక్కులను హరించేందుకు కుయుక్తులు చేస్తుంటే కేసీఆర్ కార్మికులకు మద్దతుగా నిలుస్తున్నారు. కార్మికుల హక్కులను కాపాడడం కేసీఆర్ ఒక్కరే చేయగలరు.
– వై.వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, కార్మిక సంఘం సీనియర్ నేత, సూర్యాపేట
సీఎం కేసీఆర్ తోనే కార్మికులకు భరోసా
సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైంది, మోదీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్క టిగా నిర్వీర్యం చేస్తూ ఉద్యోగులు, కార్మికులను రోడ్ల మీదికి తెస్తున్నది. ఎల్ఐసీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థ్ధలను నిర్వీర్యం చేయడమే ఇందుకు నిదర్శనం. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ తాజాగా రైల్వే స్థలాలను కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టంలో ప్రభుత్వ రంగ సంస్థలను, బలోపేతం చేస్తూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని సైతం బలోపేతం చేస్తున్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికులను వీధి పాలు చేస్తుంది. కార్మికుల బతుకులపై పరోక్షంగా జీఎస్టీ విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంది. సీఎం కేసీఆర్ లాంటి కార్యదక్షత, పట్టుదల కలిగిన నాయకుడు దేశానికి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని వర్గాల ప్రజలు, కార్మికులకు భరోసా కలుగుతుంది.
– కత్తి దానయ్య, టీఆర్ఎస్ కార్మిక విభాగం మండలాధ్యక్షుడు (పాలకవీడు)
సీఎం కేసీఆరే సమర్థుడు
ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి సమర్థ నాయకుడు జాతీయ రాజకీయాలకు అవసరముంది. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తుంది. బడా పెత్తందారులకు మోదీ సర్కారు కొమ్ముకాస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. 70 ఏండ్లుగా కాపాడుకుంటున్న ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమలను మోదీ సర్కారు అమ్మడం దుర్మార్గమైన చర్య, అంబానీ, అదానీ లాంటి భారీ పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ వేసి జాతి సంపదను నాశనం చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే కేసీఆరే సమర్థ్ధుడు.
– ఎండీ ఇమ్రాన్, ఏఐటీయూసీ భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి
కార్మికలోకానికి అండగా సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల కార్మికులకు అండగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి కేసీఆర్ మాత్రమే. కార్మికుల పక్షాన సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను దేశంలోని ప్రతి కార్మికుడు తమకు కూడా వస్తే బాగుండని కోరుకుంటున్నారు. వారంతా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఎంతో మంది కార్మికుల పొట్ట గొడుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నది. కార్మికుల హక్కులను కాలరాస్తూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న తరుణంలో కేసీఆర్ లాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోకి వస్తే కార్మిక వర్గానికి న్యాయం జరుగుతుంది.
– బుగ్గ శ్రీను, కార్మికుడు, వంగపల్లి, యాదగిరిగుట్ట