దేవరకొండ, ఏప్రిల్ 25 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలించిందని, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంపదను పెంచి పేద ప్రజలకు పంచుతుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం దేశ సంపదను గుజరాత్ బాడా వ్యాపారులకు ధారపోస్తున్నదని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎంఎల్సీ కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని సాయి రమ్య ఫంక్షన్హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారన్నారు. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి 1.50 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఫలితంగా వరిసాగులో దేశంలోనే మనం అగ్రస్థానంలో నిలిచామన్నారు. రాష్ట్రం లో అందుతున్న సంక్షేమ పథకాలు తమకూ కావాలని దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అది కూడా సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని నమ్ముతున్నారన్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను బడా వ్యాపార వేత్తలకు అప్పగించేందుకు కుట్ర పన్నుతుందన్నారు. అన్ని వస్తువుల ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొన్నారు. కేవలం మత విధ్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానిస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని పాలన సాగించడంతో పాటు దేశ రాజధానిలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తుంటే ఓర్వలేక ప్రజల దృష్టి మళ్లించడానికి ఈడీ, సీబీఐతో ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులను అడ్డుకుంటున్నదన్నారు. గత పాలకుల హయాంలో దేవరకొండ వెనుకబాటుకు గురైందని, తెలంగాణ ఏర్పాటయ్యాక సాగు, తాగునీటితో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. దేవరకొండ ప్రజలందరూ బీఆర్ఎస్కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు.
సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయాలి ;ఎమ్మెల్యే రవీంద్రకుమార్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ధ్యేయంగా పనులు సాగుతున్నాయన్నారు. నక్కలగండి, శ్రీశైలం సొరంగ మార్గం, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయితే నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. ప్రస్తుతం రూ. 600 కోట్ల నిధులతో 5 లిఫ్టుల ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. సుమారు 100 కోట్లతో దేవరకొండ మున్సిపాల్టీలో ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు చేపట్టినట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 50 వేల మెజార్టీ అందించి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందించాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. సమావేశంలో 15 తీర్మానాలను ప్రవేశ పెట్టి ఆమోదించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీలు నల్లగాసు జాన్‌యాదవ్, మాధవరం సునీతాజనార్ధన్రావు, వంగాల ప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీలు మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, కంకణాల ప్రవీణావెంకట్‌రెడ్డి, కేతావ్ బాలూనాయక్, పసునూరి సరస్వతమ్మ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, రమావత్ దస్రూనాయక్, లోకసాని తిరుపతయ్య, దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, ముత్యాల సర్వయ్య, వెలుగురి వల్లపురెడ్డి, రాజీనేని వెంకటేశ్వర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేశ్‌గౌడ్, కంకణాల వెంకట్‌రెడ్డి, గాజుల ఆంజనేయులు, రైతుబంధు మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, కేసాని లింగారెడ్డి, ఉజ్జిని విద్యసాగర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్లు పల్లా ప్రవీణ్‌రెడ్డి, ముక్కమల్ల బాలయ్య, తూం నాగార్జున్‌రెడ్డి, మాధవరం శ్రీనివాస్‌రావు, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌గౌడ్, బొడ్డు గోపాల్, మాస భాస్కర్, మునుకుంట్ల వెంకట్‌రెడ్డి, ఏడ్పుల గోవింద్‌యాదవ్, రాఘవాచారి, టీఆర్ఎస్వీ నాయకులు వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, ముచ్చర్ల ఏడుకొండలు, మేకల శ్రీనివాస్‌యాదవ్, పసునూరి యుగేంధర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నదీ జలాల కేటాయింపుల్లో కేంద్రం వివక్ష : మండలి చైర్మన్ గుత్తా
నదీ జలాల కేంటాయింపుల్లో కేంద్రం ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మన రాష్ర్టానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా కాలయాపన చేస్తుందన్నారు. దేశంలో 16 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ మాదిరి సంక్షేమ పథకాలు ఎక్కడైనా అమలు చేస్తున్నదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అందుతున్న సంక్షేమ పథకాలతో అన్ని రాష్ర్టాల ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే మోదీ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌పై కుట్ర పన్నుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.