రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే రచ్చబండ
కాంగ్రెస్ నాయకులవి అర్థం లేని మాటలు
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
ఎమ్మెల్యే సైదిరెడ్డితో కలిసి హుజూర్నగర్
నియోజకవర్గంలో పట్టణ, పల్లె ప్రగతికి హాజరు
నేరేడుచర్ల/హుజూర్నగర్ రూరల్ : రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ నియోజకవర్గంలో నాలుగో విడుత పట్టణ, ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, వివిధ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకుంటామని చెప్పడం కంటే, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ర్టాల్లోని రైతులను ఆదుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో జరగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం చేపట్టిందన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలు పరారై శుభ్రంగా మారాయన్నారు.
60 ఏండ్లలో చేయని అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ 8ఏండ్లలో చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలే పోతుందన్నారు. ఒక్క అమరవరం గ్రామ పంచాయతీలో జరిగిన అభివృద్ధి ముందు పెడితే కాంగ్రెస్ పాలన ఎంతటి దిగదుడుపు అన్నది ఇట్టే తేలిపోతున్నదన్నారు. అమరవరంలో 3,225 మందికి రైతు బంధు, రైతుబీమా కింద 34 మందికి కోటి 70లక్షలు అందించిన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వానిదని తెలిపారు. మిషన్ కాకతీయ కింద కోటి 20 లక్షలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 200 మందికి రూ.2 కోట్లు, కేసీఆర్ కిట్టును 200 మందికి అందించామన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 60 ఏండ్లలో ఇక్కడి రైతాంగానికి రూ.25 లక్షలు ఇచ్చారా అని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. అంతకముందు అమరవరం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో రూ.30 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు లింగగిరి, శ్రీనివాస పురంలో పల్లె ప్రగతిలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకులవి అసత్య ఆరోపణలు..
ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ.. రచ్చబండ పేరుతో కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గంలో బోగస్ మాటలతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 25 ఏండ్లుగా ప్రజా ప్రతినిధిగా ఉన్న ఉత్తమ్ ఏనాడూ గ్రామాలకు వెళ్లి సమస్యలు తెలుసుకోలేదన్నారు. నియోజకవర్గంలో ఉత్తమ్ కట్టిన లిఫ్టులు కాంట్రాక్టర్ల లబ్ధి కోసం తప్ప, రైతుల అవసరాలు తీర్చడానికి కాదన్నారు. తాను రెండున్నరేండ్లలో చేసిన అభివృద్ధిని, 25 ఏండ్లలో ఉత్తమ్ చేసిన అభివృద్ధిని ప్రజలే పోల్చి చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికాయుగంధర్, ఎంపీపీలు గూడెపు శ్రీనివాస్, పార్వతీకొండానాయక్, జడ్పీటీసీలు కొప్పుల సైదిరెడ్డి, జగన్నాయక్, జడ్పీ సీఈఓ సురేశ్, ఎంపీడీఓ శాంతకుమారి, సర్పంచులు సుజాతాఅంజిరెడ్డి, రమ్యానాగరాజు, అంజిరెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలు
నేరేడుచర్ల : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గ్రామాలు, పట్టణాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే సైదిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులతో కలిసి ఉల్లాసంగా వాలీబాల్ ఆడి అలరించారు. సుమారు అరగంటపాటు అలుపెరగకుండా మండుటెండను సైతం లెక్కచేయకుండా ఆడడంతో వీక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆర్పీలతో కలిసి ఫొటో దిగారు. మంత్రిని మున్సిపాలిటీ పాలకవర్గంతో పాటు పలువురు అభిమానులు సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, వైస్ చైర్పర్సన్ శ్రీలతారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, ఎంపీపీ లకుమళ్ల జ్యోతి, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ యశోదారాములు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ గుర్రం మార్కండేయ, మత్స్య కార్మిక సంఘం చైర్మన్ వీరయ్య, చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్ శ్రీను, కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్డీఓ వెంకారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.