యాదగిరిగుట్ట, ఫిబ్రవరి16 : రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణను దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ జన్మదినం కానుకగా యాదగిరిగుట్టకు 100పడకల ఏరియా ఆస్పత్రి పనులు చేపడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఈ ఆస్పత్రి స్థానిక, పరిసర మండలాల ప్రజలతో పాటు, స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందన్నారు. గురువారం ఆయన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సైదాపురంలో రూ.35.95కోట్లతో ఆరెకరాల్లో నిర్మిస్తున్న 100పడకల ప్రాంతీయ వైద్యశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గవ్యాప్తంగా 35 పీహెచ్సీ, సబ్ సెంటర్ల భవన నిర్మాణాలకు గాను ఒక్కో భవనానికి రూ.20లక్షలు మంజూరు చేశామన్నారు. 3నెలల్లో భవన నిర్మాణాలు పూర్తి కావాలని సూచించారు. ఒక్కో సబ్ సెంటర్‌ను పల్లె దవాఖానగా మార్చి ఎంబీబీఎస్ వైద్యుడిని అందుబాటులోకి తెస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఒక్క డయాలసిస్ సెంటర్ సైతం లేదని, ప్రస్తుతం భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్‌లో ఒక్కో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసి కిడ్నీ బాధితులకు అండగా నిలిచామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమ్మ కోరిక మేరకు ఆలేరు ప్రభుత్వాసుపత్రి ఆధునీకరణకు రూ.కోటి మంజూరు చేస్తానని హామీనిచ్చారు. వైద్య రంగానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. పీహెచ్‌సీల స్థాయిని పెంచి పల్లె, పట్టణ దవాఖానలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. యాదగిరిగుట్టతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా చౌటుప్పల్, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో 100 పడకల ఆస్పత్రులు నిర్మించనున్నట్లు తెలిపారు. పేదలకకు స్థలముటే డబుల్ బెడ్రూం నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తామన్నారు.
నల్లగొండలో పెద్ద పెద్ద లీడర్లు ఏం చేశారు?
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నా అప్పట్లో మెడికల్ కళాశాలలు తేవాలని ఎందుకు ఆలోచించలేదో ప్రజలకు చెప్పాలన్నారు. ఒకప్పుడు ఎంబీబీఎస్ చదువాలంటే విదేశాలకు వెళ్లే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా రెండు మెడికల్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. త్వరలో యాదాద్రి భువనగిరి జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేయబోతున్నామన్నారు.
భూలోక వైకుంఠంగా యాదగిరిగుట్ట
ఊహించని రీతిలో యాదగిరిగుట్ట ఆలయం భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దారని అన్నారు. ఎన్నికలయ్యే వరకు ఆలయాలు నిర్మించడం, ప్రారంభిచడం బీఆర్ఎస్ సంస్కృతి కాదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఏ పని చేసినా ప్రజల కోసమే చేశారని కొనియాడారు. అసెంబ్లీలో గానీ, ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కనిపించినా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఏదో సమస్యను తమ దృష్టికి తెస్తుందని, పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టబోదని అన్నారు.
కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, డీహెంఎచ్ఓ మల్లికార్జున్, నార్మాక్స్ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బీకూనాయక్, మున్సిపల్ చైర్మన్లు ఎరుకల సుధ, వస్పరి శంకర్, ఎంపీపీలు భూక్యా సుశీల, పైళ్ల ఇందిర, జడ్పీటీసీలు తోటకూరి అనూరాధ, పల్లా వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు ఇమ్మడి రాంరెడ్డి, మల్లేశ్‌గౌడ్, గుట్ట పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, బొట్ల యాదయ్య, శ్రీనివాస్‌యాదవ్, నరేందర్‌రెడ్డి, బీసు చందర్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్, ఎండీ.ఖలీల్, యువజన విభాగం అధ్యక్షులు ఎండీ.అజ్జు, కృష్ణంరాజు, సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్‌గౌడ్, పాపట్ల నరహరి, మల్లేశ్ యాదవ్, నాయకులు వంటేరు సురేశ్‌రెడ్డి, మారెడ్డి కొండల్‌రెడ్డి, ఎం.వెంకటయ్య, కే.మహేందర్ పాల్గొన్నారు.
హరీశ్‌రావు స్ఫూర్తి యువతకు ఆదర్శం
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
2001నుంచి బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడు మంత్రి హరీశ్‌రావు అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కొనియాడారు. ఇచ్చిన పనిని సాధించే వ్యక్తిత్వం కలిగిన మంత్రి హరీశ్‌రావు యవతకు ఆదర్శమని కొనియాడారు. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మంత్రి హరీశ్‌రావు చూపిన చొరవతో ఆలేరు నియోజకవర్గవ్యాప్తంగా 529 చెరువులు పునరుద్ధరించామని, అవి ఇప్పుడు నీటితో కళకళలాడుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించేందుకు మంత్రి హరీశ్‌రావు నిద్రలేని రాత్రులు గడిపారని, హరీశ్‌రావును కాళేశ్వర్రావు అని పిలిచేవారని గుర్తు చేశారు. ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 317జీఓతో స్థానికులకే ఉద్యోగ అవకాశాలను తొలిసారిగా అమలు చేసిన ఘనత మంత్రి హరీశ్‌రావుదేనని కొనియాడారు. మారుమూల పల్లె దవాఖానల్లో సైతం అనుభవజ్ఞులైన వైద్యులను అందుబాటులోకి తేవడం గొప్ప విషయమన్నారు.
గొప్పగా సర్కారు దవాఖానలు
ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
ఒకప్పుడు సర్కార్ దవాఖానలకు వెళ్లాలంటే ప్రజలు భయపడేదని, సీఎం కేసీఆర్ పాలనలో సర్కార్ దవాఖానలు బాగా అభివృద్ధి చెందాయని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ప్రజలంతా ధైర్యంగా సర్కార్ దవాఖానలకు వెళ్లి ఆనందంగా తిరిగి వస్తున్నారని చెప్పారు. ఉద్యమ కాలం నుంచి గొంగిడి దంపతులది క్రమశిక్షణ కలిగిన నాయకత్వమని కొనియాడారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడుతున్నట్లు తెలిపారు.
కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానకర్తలుగా వ్యవహరించాలి
కంచర్ల రామకృష్ణారెడ్డి
వచ్చే ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి సూచించారు. ఆలేరులో అభివృద్ధి బాగా జరిగిందని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు ఉద్యమ స్ఫూర్తిని చూపాలన్నారు.